మూడు రాజధానులు: ఏపీ కి సుప్రీం లో చుక్కెదురు

- August 26, 2020 , by Maagulf
మూడు రాజధానులు: ఏపీ కి సుప్రీం లో చుక్కెదురు

న్యూఢిల్లీ : పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల కేసును రోజువారీ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. వేగంగా విచారించి పరిష్కరించాలని సూచించింది. పాలన వీకేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై బుధవారం సప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో రేపే(గురువారం) విచారణ ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రాకేష్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ  ఈ విధంగా జోక్యం చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు.

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీంతో సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్‌లో పేర్కొన్నది.రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com