అన్నదాతల అభివృద్ధితో దేశాభివృద్ధి:ఉపరాష్ట్రపతి
- October 30, 2021
విజయవాడ: అన్నదాతల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు.కరోనా మహమ్మారి ముప్పిరిగొన్న నేపథ్యంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మరచిపోలేనిదన్న ఆయన, రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తి కాదని, సేద్యాన్నే తమ జీవితంగా భావిస్తారని తెలిపారు.
శనివారం విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో జరిగిన ముప్పవరపు ఫౌండేషన్ – రైతునేస్తం అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి పలువురు రైతులతో పాటు సేద్యానికి దన్నుగా నిలుస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పాత్రికేయులకు అవార్డులు అందజేశారు. 17 సంవత్సరాలుగా రైతునేస్తం మాసపత్రిక ద్వారా అన్నదాతకు చేదోడుగా నిలవడమే గాక, ఏటా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వర రావు గారిని ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా అభినందించారు.
రైతులకు అండగా నిలబడే ఎవరైనా అభినందనీయులేనన్న ఉపరాష్ట్రపతి, మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఏటా అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. మంచిని ప్రోత్సహించడం భారతీయ సంస్కృతిలో భాగమన్న ఆయన, మంచి పని చేసిన ఒక్కరిని ప్రోత్సహించడం ద్వారా మరెంతో మంది అదే స్ఫూర్తితో మంచి కార్యక్రమాల దిశగా ముందుకు వస్తారని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయులకే దక్కుతుందన్న ఉపరాష్ట్రపతి, భారతీయ వాజ్ఞ్మయంలో కృషి విజ్ఞాన ప్రస్తావన ఉందన్నారు. మట్టిలోని సారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయమన్న ఆయన, పర్యావరణ హిత వ్యవసాయ విధానాల మీద రైతుల దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులకు ప్రస్తుతం మంచి ధర లభిస్తోందన్న ఆయన, వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు... పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అని తెలిపారు.
ప్రతి రైతుల తమ కమతాల్లో కొంత భాగాన్ని పర్యావరణాన్ని కాపాడే చెట్ల పెంపకం, జలసంరక్షణ వంటి వాటి కోసం కేటాయించాలన్న ఉపరాష్ట్రపతి, రైతులకు ఇలాంటి విషయాల్లో చేయూతనందించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని సూచించారు. మద్దతు ధరలతో పాటు రైతులకు దన్నుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఆయన, రైతులు కూడా ఖర్చులు తగ్గించుకునే పద్ధతులు అవలంబించాలని సూచించారు.
వ్యవసాయ రంగం ఆదాయ రంగంగా మారాలంటే ప్రభుత్వాలు మాత్రమే ముందుకొస్తే సరిపోదన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచమంతా సాంకేతికత వెనుక పరుగులు తీస్తోందని, వ్యవసాయం కూడా సాంకేతికత బాట పట్టాలని సూచించారు. ఇందు కోసం చదువుకున్న యువత వ్యవసాయరంగం మీద దృష్టి కేంద్రీకరించాలన్న ఆయన, మొబైల్ అనువర్తనాల రూపంలో అందివచ్చిన సమాచారాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి రైతుకీ సాంకేతికతను అందించేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించిన ఆయన, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి కోసం, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పన కోసం, ఈ రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రైవేట్ రంగం పెట్టుబడులతో ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు.
స్వేచ్ఛా వాణిజ్యానికి ఆస్కారమున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, ఆధునిక వ్యవసాయ విధానాల మీద మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందు కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రత్యేకించి మీడియా చొరవ తీసుకుని ముందుకు రావాలన్న ఆయన, రైతు మేలు కోరి మనం చేసే ఏ కార్యక్రమమైనా వారి కోసం కాదని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసమని తెలిపారు.
ఇదే వేదిక నుంచి వ్యవసాయానికి సంబంధించిన పలు పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందు రైతునేస్తం సంస్థ ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల ప్రదర్శనను తిలకించిన ఆయన, పలు ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వర రావు, భారతీయ కిసాన్ సంఘ్ దక్షిణభారత బాధ్యులు కుమార స్వామి సహా పలువులు రైతులు, రైతు ప్రముఖులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రచయితలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..