ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇగ్లూకేఫ్‌

- February 06, 2022 , by Maagulf
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇగ్లూకేఫ్‌

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో స్కైరిసార్ట్‌లో నిర్మితమైన 'ఇగ్లూకేఫ్‌' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసంతో నిర్మితమైన ఈ ఇగ్లూ కేఫ్‌ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇగ్లూకేఫ్‌గా రికార్డులకెక్కింది. 25 మంది అవిశ్రాంతంగా పనిచేయడంతో 64 రోజుల్లో నిర్మించగలిగామని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1700 పనిదినాలు పట్టాయని ఈ ఇగ్లూ రూపకర్త సయ్యద్‌ వసీం షా తెలిపారు.ఐదు అడుగుల మందంతో నిర్మించామని, మార్చి 15 వరకు ఉంటుందని అన్నారు. పది టేబుల్స్‌తో ఒకేసారి 40 మంది కూర్చుని తినవచ్చని అన్నారు. స్విట్జర్లాండ్‌లో మంచు కురిసే సమయంలో ఇదే విధంగా నిర్మితమైన ఇగ్లూలను చూశానని,  అక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారని అన్నారు. గుల్మార్గ్‌లో కూడా అత్యధికంగా మంచు కురుస్తుంటుందని, అలాంటివి ఇక్కడ కూడా ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచన వచ్చిందని షా తెలిపారు. గతేడాది కూడా ఇగ్లూ కేప్‌ను నిర్మించానని, ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డుల్లోకెక్కిందని అన్నారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇగ్లూకేఫ్‌ ని రూపొందించామని అన్నారు. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం.. అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌ స్విట్జర్లాండ్‌లో ఉందని, అది 33.8 అడుగుల ఎత్తు, 42.4 అడుగుల వ్యాసంతో ఉంటుందని, ఈ కేఫ్‌ దానికంటే పెద్దదని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com