బండి సంజయ్ హౌస్ అరెస్ట్..

- June 10, 2022 , by Maagulf
బండి సంజయ్ హౌస్ అరెస్ట్..

హైదరాబాద్: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. టీఎస్ ఆర్టీసీ గత కొద్దీ రోజులుగా పలు సేస్ పేర్లతో బస్ చార్జీలను పెంచుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఛార్జీల పెంపును నిరసిస్తూ.. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు బండి సంజయ్. దీంతో జేబీఎస్ వద్ద నిరసన తెలపడానికి బీజేపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఈ తరుణంలో బండి సంజయ్ అక్కడకు వెళ్లకుండా పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారు.

ప్రజల తరఫున పోరాడే పార్టీ బిజెపి అని బండి సంజయ్ అన్నారు. తమ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. తమకు అరెస్టు, జైళ్లు కొత్త కావని.. ప్రభుత్వం ఎంత వరకు తెగించినా.. ప్రజల కోసం పోరాడటానికి తాము సిద్ధమని చెప్పారు. తమ ప్రయత్నాలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా.. బస్సు ఛార్జీల పెంపుపై ఇవాళ ధర్నాలు చేసి తీరతామని భాజపా నేతలు స్పష్టం చేశారు.ఛార్జీల పెంపుపై నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల బాధలు తెలుసుకోవడం నేరమా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను కేసీఆర్ సర్కార్ అణచివేస్తోందని మండిపడ్డారు. అరెస్టులు, అణచివేతలతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అలాగే బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అక్రమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సంజయ్.. జూన్ 2న ‘‘అమరుల యాదిలో… ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’’ను జిట్టా నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై జిట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు.

జిట్టాను పోలీసులు అర్దరాత్రి అదుపులోకి తీసుకోవడంపై సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా అర్ధరాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమేంటని పోలీసుల తీరుపట్ల ఆయన మండిపడ్డారు. జిట్టాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా కేసీఆర్ సర్కారు, పోలీసులదే పూర్తి బాధ్యత అని సంజయ్ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com