తెలంగాణలో రెయిన్ అలర్ట్..

- October 07, 2022 , by Maagulf
తెలంగాణలో రెయిన్ అలర్ట్..

హైదరాబాద్: బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. అటు తెెలంగాణలోని ఆరు జిల్లాల్లో అతి భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ జిల్లాల ప్రజ‌లంతా అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌ను వ‌ర్షాలు ముంచెత్తాయి. దీంతో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. చెరువులు, కుంట‌లు అలుగు పార‌డంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంతో పాటు కర్ణాగూడ, పోచారం, ఉప్పరిగూడ గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో చెరువులు ఉగ్రరూపం దాల్చాయి. అటు ఏపీలోనూ ఉపరితల ద్రోణి ఆవర్తన ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏలూరు జిల్లా టీ. నరసాపురం మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. టీ. నర్సాపురం, బంధంచర్ల గ్రామాల్లో రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com