5 వేల వీధి కుక్కల కోసం కొత్త పెట్ పార్క్‌

- March 16, 2023 , by Maagulf
5 వేల వీధి కుక్కల కోసం కొత్త పెట్ పార్క్‌

బహ్రెయిన్: అస్కర్‌లో 5,000 కంటే ఎక్కువ వీధి కుక్కలకు వసతి కల్పించే కొత్త పెట్ పార్క్ త్వరలో ప్రారంభం కానుంది.  కొత్త పార్క్ 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో నడక మార్గాలతోపాటు ఆట స్థలాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వైద్యపరంగా స్టెరిలైజ్ చేసిన తర్వాత, బహ్రెయిన్ అంతటా ఉన్న వీధి కుక్కలను ఈ పార్క్‌లోకి అనుమతించనున్నారు. దీంతో దేశంలోని వీధికుక్కల సమస్యకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని జంతు ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది బుహైర్ ప్రాంతంలో వీధికుక్కల సంఖ్య అధికంగా ఉందని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు 33 వీధికుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు. అదే విధంగా  చాలా మంది పౌరులు, నివాసితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీధికుక్కల బెడద పెద్ద ఆందోళనగా ఉందని ఫిర్యాదులు, వాటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తులను చేయడంతో అధికారులు కొత్త పార్క్ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రముఖ బహ్రెయిన్ జంతు ప్రేమికుడు, బహ్రెయిన్ స్ట్రేస్ వ్యవస్థాపకుడు ఫాతియా అల్ బస్తాకి మాట్లాడుతూ.. పార్క్ 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నారు. అయితే, ఆ స్థలంలో 5,000 కుక్కలు ఉండలేవన్నారు. సాధారణంగా కుక్కలకు అధిక స్థలం అవసరం అవుతుందని, అవి ఎల్లప్పుడూ స్వేచ్ఛగా తిరుగుతాయని పేర్కొన్నారు. అధికారులు వీధి కుక్కల కోసం ఒక ప్రత్యేక ద్వీపాన్ని ఏర్పాటు చేస్తే.. అక్కడ అవి స్వేచ్ఛగా జీవించగలవని ఫాతియా అల్ బస్తాకి సూచించారు. 

 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com