శ్రీవారు కరీంనగర్ లో కొలువు దీరడం అదృష్టం

- June 01, 2023 , by Maagulf
శ్రీవారు కరీంనగర్ లో కొలువు దీరడం అదృష్టం

కరీంనగర్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కరీంనగర్లో అత్యంత వైభవంగా నిర్మిస్తూ శంకుస్థాపనం చేశామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నేడు పద్మనగర్ ప్రాంగణంలో తిరుమల తిరుపతి వేదపండితులచే టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు రసమయి, సుంకే రవిశంకర్ ఎమ్మెల్సీలు విప్లు భాను ప్రసాద్, కౌశిక్ రెడ్డి, టిటిడి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు తదితర ప్రముఖుల, అశేష జనవాహిని సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది.

ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, ఫిలేష్టికలకు, శంఖువుకు, అభిషేకం అనంతరం వేదమంత్రాలతో శంకుస్థాపన నిర్వహించారు.

కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుని కృపతోనే కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారం అయిందన్నారు, ఆలయ స్థలంలో ఆ దేవదేవుడే కోనేరు లాంటి పురాతన బావిని తనకిష్టమైన చింత చెట్టును ఏర్పాటు చేసుకోవడమే ఈ వైభవానికి నిదర్శనం అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి కరీంనగర్ ప్రజా ప్రతినిధులు ఆలయ అనుమతి కోసం ప్రతిపాదన చేసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి ప్రత్యేకంగా లేఖ రాయడం, కరీంనగర్ లో పదెకరాల స్థలాన్ని కేటాయించడం, తదనంతరం ఏపీ సీఎం ఆమోదంతో టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరగడం చాలా సంతోషకరమన్నారు. టీటీడీ 20 కోట్ల నిధులతో ఆలయాన్ని నిర్మిస్తుందని మిగతా నిర్మాణ నిధులను భక్తులమే సమకూర్చుకుంటామన్నారు. వెయ్యేళ్ల కాలంలో  దొరికే ఈ గొప్ప కార్యంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు మంత్రి, కరీంనగర్ ప్రజలందరికీ ఈ అదృష్టం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని భక్తులు హాజరవ్వాలని కోరారు మంత్రి గంగుల.

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన టిటిడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కరీంనగర్ ఆలయ నిర్మాణం కోసం మంత్రి గంగులతో పాటు వినోద్ కుమార్, భాస్కరరావు, దామోదర్ రావు అభ్యర్థించారని, సీఎం కేసీఆర్ గారి విజ్ఞాపనతో ముఖ్యమంత్రి జగన్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. టీటీడీ తరఫున 20 కోట్ల నిధులను కేటాయించడంతోపాటు సంపూర్ణంగా తిరుమల మాదిరే క్రతువులు నిర్వహిస్తామని, తిరుమల వేద పండితులు నిరంతరం ఇక్కడే ఉంటారన్నారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ సంతోషం కలిగిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తిన్నారా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి కరీంనగర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com