శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ..
- July 20, 2023
హైదరాబాద్: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ (JBS) నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.
ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది.
మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది.
రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది.
సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది.
రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుంను ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్http://tsrtconline.in లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033కు ఫోన్ చేయొచ్చు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







