తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ

- July 20, 2023 , by Maagulf
తెలుగులో తొలి ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఆవిష్కరణ

హైదరాబాద్: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెక్ పుస్తకం “ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా?.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా” అనే పుస్తకాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టు ఆవరణలో ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ బీఎన్ కలిసి రచించారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది.

ఇందులో ప్రధానంగా తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాంటి తప్పుడు సమాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి? దానికోసం మనం తెలుసుకోవాల్సిన అంశాలపై “ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా” పుస్తకం అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది.

ఈ సందర్భంగా జస్టిస్‌ బి విజయసేన్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘‘ఫ్యాక్ట్‌ చెక్‌కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఫ్యాక్ట్‌ చెక్‌ను ప్రచారం చేయాలనే ఆలోచన పట్ల నేను సంతోషిస్తున్నాను. ప్రజలలో పెరుగుతున్న అవగాహన, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే ఒక వ్యవస్థను కలిగి ఉండటం ఎంతో అవసరం, తద్వారా ఆసక్తి ఉన్నవారందరికీ ప్రయోజనం చేకూరుతుంది.

వ్యవస్థ సమతుల్యంగా నడవాలి కాబట్టి ప్రతి ప్రొఫెషనల్‌, ప్రతి కార్యాచరణకు కొంత బాధ్యత అనేది ఉండాలి. వార్తలు, తప్పుడు సమాచారం తప్పుడు రిపోర్టింగ్‌, ఉద్దేశపూర్వకంగా హానికరమైన ప్రచారం చేయడం వంటి సంఘటనల గురించి మనందరికీ తెలుసు. అందువలన, తప్పుడు రిపోర్టింగ్‌, తప్పుడు సమాచారం యొక్క బాధితులకు ఒక వేదిక ఉండాలి. ఈ ఫ్యాక్ట్‌ చెక్‌ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ” అని చెప్పారు.

ఓయూ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ కె స్టీవెన్‌సన్ మాట్లాడుతూ.. ‘‘చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్‌ల వరకు ఈ పుస్తకం వివరాలు అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, పబ్లిక్‌ ప్రచారాలు, మహమ్మారి సమయంలో ఏం జరుగుతుందనే విషయాలపై అవగాహన కల్పిస్తుంది” అని పేర్కొన్నారు.

“ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా” పుస్తక రచయితల్లో ఒకరైన ప్రముఖ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గతంలో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్‌పై పరిశోధనాత్మక రచన ‘బ్లడ్ సాండర్స్–ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్’ అనే పుస్తకాన్ని రచించారు. “ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా” పుస్తకాన్ని అమెజాన్ లో కొనుగోలు చేయొచ్చు. మరింత సమాచారం కోసం 9959154371 / 9963980259 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com