అధికార వ్యవస్థలో నిజాయతీపరులుంటేనే దేశాభివృద్ధి: వెంకయ్యనాయుడు
- August 27, 2023
హైదరాబాద్: దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే రాజకీయ నాయక గణం సమర్థులు, నిజాయతీపరులైనంత మాత్రాన సరిపోదని, అధికార వ్యవస్థలో సమర్థులు, నిజాయతీపరులైన వారు ఉండాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ గా పదవీ విరమణ చేసిన గూడపాటి సీతారామస్వామి గారి జీవిత చరిత్ర ‘నిలువెత్తు నిజాయతీ’ పుస్తకావిష్కరణలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు సమర్థులు, నిజాయతీపరులై ఉండాల్సిందే. కానీ ప్రభుత్వ విధానాలు పై నుంచి క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలు జరగాలంటే అధికార వ్యవస్థలో ఉన్నతస్థాయి నుంచి కింది స్థాయి వరకు కార్యదక్షత, నిజాయతీ, అంకిత భావం ఉన్న అధికారులు, సిబ్బంది కావాలి.’’ అని స్పష్టం చేశారు. నిజాయతీపరులయిన అధికారులను గుర్తించి గౌరవించాలన్నారు. శ్రీ గూడపాటి సీతారామస్వామి గారి జీవనయానం ఆదర్శప్రాయమని అన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, అమ్మభాషను మరిచిన వారు మానవులే కాదని శ్రీ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఉన్నతస్థాయిలో ఉద్యోగ విరమణ చేసినా, పిల్లలు నగరాల్లో స్థిరపడినా శ్రీ గూడపాటి సీతారామస్వామి గారు తన పుట్టి పెరిగిన ఊరు పొట్టిపాడును మరవకుండా అక్కడే నివాసం ఉంటూ గ్రామాభివృద్ధికి ఈ వయస్సులోనూ కృషి చేయడం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇప్పటికీ సింహభాగం జనాభా పల్లెల్లోనే ఉంటున్నారని, గ్రామాభివృద్ధే దేశాభివృధ్ది అని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ సమీపంలోని ఆత్కూరులో ఏర్పాటు చేయడం వెనక సీతారామస్వామి కృషి ఎంతో ఉందని చెప్పారు.
‘నిలువెత్తు నిజాయతీ’ పుస్తకం చదివితే ఒక ఉద్యోగి, ఒక వ్యక్తి ఎలా ఉండాలో స్పష్టమైన మార్గదర్శనంలా దర్శనమిస్తుందని, ప్రతి ఉద్యోగీ, ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు, నేటి యువతరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమని చెప్పారు. ఈ పుస్తకాన్ని పాఠ్యాంశాల్లో భాగంగా చేస్తే విద్యార్థులు చాలా మంచి విషయాలు నేర్చుకుంటారన్నారు. శ్రీ సీతారామస్వామి గారు ప్రణాళికాబద్ధంగా తన ఉద్యోగ జీవితాన్ని, కుటుంబజీవితాన్ని, సామాజిక జీవితాన్ని మలుచుకున్నారని చెప్పారు. వారి కుమారుడు శ్రీ గూడపాటి రమేశ్ ఎంతో ప్రముఖ వైద్యుడయినప్పటికీ ఎంతో అణకువతో, నిరాడంబరంగా ఉంటారని, వారి కుటుంబసభ్యులందరూ నిరాడంబరంగా ఉంటున్నారంటే సీతారామస్వామి తమ పిల్లలను ఎంత సంస్కారవంతంగా పెంచారో అర్థం చేసుకోవచ్చన్నారు. నేటి తరానికి, రేపటి తరానికి ప్రేరణ కలిగించడమే ఇలాంటి నిజాయతీపరుల జీవిత చరిత్ర పుస్తకాల ఉద్దేశమని చెప్పారు. ఇందుకు చొరవ తీసుకున్న గూడపాటి రమేశ్ , ఇతర కుటుంబసభ్యులు, రచయిత పాలకోడేటి సత్యనారాయణరావుగారు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, ప్రముఖ నటుడు మాగంటి మురళీ మోహన్ విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి