123కు చేరిన మృతులు..కేరళలో రెండ్రోజుల సంతాప దినాలు

- July 30, 2024 , by Maagulf
123కు చేరిన మృతులు..కేరళలో రెండ్రోజుల సంతాప దినాలు

వయనాడ్: కేరళలోని వయనాడ్‌ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 123కు చేరింది.ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మోప్పాడి సమీపంలోని పలు కొండ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. అనేక మంది గాయపడగా, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయారు. రెస్యూ ప్రయత్నాల్లో భాగంగా సెకండ్-ఇన్-కమాండ్ కింద ఒక మెడికల్ అధికారి, ఇద్దరు జేసీఓలు, 40 మంది జవాన్లను మోహరించినట్టు డిఫెన్స్ పీఆర్ఓ తెలిపారు.

కాగా, 300 మంది సిబ్బందితో భారత ఆర్మీ బలగాలను వెంటనే రంగంలోకి దింపినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అదనపు ఆర్మీ బలగాలు, నేవీ సిబ్బంది, వాయిసేన హెలికాప్టర్లను సమీకరించామని చెప్పారు. భారీ ఇంజనీరింగ్ సామాగ్రి, డాగ్ టీమ్‌లు, నిత్యావసరాలను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా త్రివేండ్రం, బెంగళూరు, ఢిల్లీ నుంచి పంపిస్తున్నట్టు వివరించారు.

వయనాడ్ విలయం నుంచి కేరళను ఆదుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సాయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. కేరళ బ్యాంక్ ఇప్పటికే సీ ఎండీఆర్ఎఫ్ కోసం రూ.50 లక్షలు కంట్రిబ్యూట్ చేసిందని, సిక్కిం ముఖ్యమంత్రి రూ.2 కోట్లు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ.5 కోట్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజుల సంతాప దినాలు ప్రకటించామని, పబ్లిక్ ఈవెంట్లు, ఉత్సవాలు నిషేధించామని తెలిపారు. సంతాప దినాల్లో జాతీయ పతకాన్ని 'హాఫ్-మాస్ట్' చేయాలని ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com