టాటా కంపెనీ మన దేశానికి నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యింది..?

- August 02, 2024 , by Maagulf
టాటా కంపెనీ మన దేశానికి నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యింది..?

టాటా ఫ్యామిలీ చేస్తున్న వ్యాపారాలు ఏంటంటే..?

టాటా గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంస్థ అయిన ఈ టాటా గ్రూప్ ఎన్నో రంగాల్లో విస్తరించింది. ఉప్పు నుండి ఉక్కు వరకు.. టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దాంట్లో టాటా పేరు వినబడుతుంది. సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో ఉంది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు 30 లక్షల 25 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. అంటే టాటా గ్రూప్ మార్కెట్ విలువ పాకిస్తాన్ జిడిపి కన్నా ఎక్కువ. అయితే ఈ టాటా గ్రూప్స్ ని ఎవరు, ఎప్పుడు స్థాపించారు..? ఈ టాటా భారతదేశానికి నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనదేశంలో 150 ఏళ్లుగా టాటా వ్యాపారంగంలో రాణిస్తుంది. జంషెడ్ జి టాటా 1839వ సంవత్సరంలో గుజరాత్ లోని నవసారి అనే జిల్లాలో జన్మించారు. ఈయనకు దేశభక్తి చాలా ఎక్కువ. దీంతో తన వ్యాపారాల వల్ల కొందరికైనా జీవన ఉపాధి కలిగించాలని అనుకునేవారు. మొదట ఆయన 1868లో పత్తి (కాటన్) వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లగ్జరీ హోటల్, తాజ్ హోటల్ వంటివి నిర్మించారు. ఇక జంషెడ్ మరణానంతరం  ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారుడు దొరాబ్జీ టాటాకు అప్పగించారు. ఈయన టాటా గ్రూప్ ని గణనీయంగా విస్తరించారు. జంషెడ్ జీ టాటా చిన్న కుమారుడైన రతన్ జి టాటా కూడా వ్యాపారంలో రాణించారు. రతన్ జీ టాటా మరణానంతరం వ్యాపారాలు అన్నింటిని ఆయన భార్య నవజ్ భాయ్ సేట్ కొంతకాలం చూసుకున్నారు. ఆ తరువాత రతన్ జి టాటా కుమారుడు నావల్ టాటా ఉక్కు, టాటా పవర్ వ్యాపారాలను విజయపథంలో నడిపించారు. 

ఇక 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. ఈయన ప్రస్తుతం మన దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా వెలుగొందుతున్నారు. ఈయన హయాంలోనే టాటా గ్రూప్ ఉన్నత శిఖరాలకు చేరింది. అయితే టాటా భారత దేశంలో ఎలా అభివృద్ధి చెందింది అంటే.. వీరు వ్యాపారంలో ఎక్కువగా మనకు లాభాలు వస్తున్నాయా అని ఆలోచించకుండా.. మనం చేసే పని దేశానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది మాత్రమే చూస్తారు. ఆ కారణంగానే ఈ టాటా గ్రూప్ ఇప్పుడు మన దేశానికి నేషనల్ ఛాంపియన్ గా మారింది. అసలు నేషనల్ ఛాంపియన్ అంటే ఏంటంటే.. ఏ బిజినెస్ గ్రూప్ అయితే.. ప్రభుత్వం యొక్క పూర్తి అండదండలతో, మనదేశ ఎదుగుదలను పెంచుతూ.. ఉద్యోగ అవకాశాలను కల్పించి, మన దేశ ప్రగతిని పెంచుతుందో దాన్నే నేషనల్ ఛాంపియన్ అంటారు. 

అలా మనదేశంలో నేషనల్ ఛాంపియన్ టాటా గ్రూప్ అనే చెప్పాలి. ఈ గ్రూప్ మన దేశం కోసం ఎన్నో చేసింది. అవేంటంటే.. ఓసారి రతన్ టాటా తన కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఓ భార్యాభర్త, వారి ఇద్దరి పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. దీంతో వెంటనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయలలో ఒక కారుని తయారు చేయాలని ఇంజనీర్లను పిలిచి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అది సాధ్యం కాదని వారు చెప్పినప్పటికీ రతన్ టాటా ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. అదే నానో. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కారు కొద్దిగా విఫలం అయింది. ఇదే కాకుండా అప్పట్లో భారతదేశంలో ఎటువంటి నాణ్యమైన సంస్థలు ఉండేవి కావు. దీంతో ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. దీంతో ఇదే టాటా సంస్థ జేఎన్ టాటా ఎండోమెంట్ అనే సంస్థను ప్రారంభించి మన దేశ యువతను విదేశాలకు వెళ్లి చదువుకునేలా చేసింది. 

ఇక అప్పట్లో మన దేశంలో సరైన హోటల్స్ ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ హోటల్ బయట కుక్కలకు, భారతీయులకు ప్రవేశం లేదు అని రాసి ఉండేది. ఆ సందర్భంలో దేశంలోనే అత్యంత విలాసవంతమైన తాజ్ హోటల్స్ ని నిర్మించింది టాటా. ఈ హోటల్స్ వల్ల ఈ గ్రూప్ కి అంతగా లాభాలు లేకపోయినప్పటికీ మన దేశ ప్రజలకు ఈ హోటల్స్ అవసరం ఉందని భావించిన టాటా ఈ హోటల్స్ ని స్థాపించింది. ఇక మనం వాడుతూ వచ్చిన ఎన్నో విదేశీ వస్తువుల స్థానంలో.. టాటా విదేశీ వాడకాన్ని తగ్గించి స్వదేశీ వస్తువులతో ఇండియాని ఇండిపెండెంట్ గా నిలిపింది. అలాగే 1968 నుంచి కంప్యూటర్స్ వాడకం పెరిగింది. అయితే ఈ కంప్యూటర్స్ ని ఎవరు ఉపయోగిస్తారో.. వారే ఇక్కడ నిలదొక్కుకోగలరని అర్థం అయ్యింది.  పని కూడా చేయాలని టాటా కంపెనీ టిసిఎస్ ని స్థాపించింది. ఈ కంపెనీ వల్ల ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పన లభించింది. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది.. టాటా ఏ పని చేసినా లాభం కన్నా దేశం యొక్క అవసరం, ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పనిచేస్తున్నందువల్లే టాటా భారతదేశానికి నేషనల్ ఛాంపియన్ గా మారింది.

--సాయికృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com