అను హాస్పిటల్స్ లో అత్యాధునిక చికిత్స

- September 10, 2024 , by Maagulf
అను హాస్పిటల్స్ లో అత్యాధునిక చికిత్స

విజయవాడ: అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తోన్న అను హాస్పిటల్స్ నందు ఇటీవల అత్యంత సంక్లిష్టమైన, అరుదైన చికిత్సను నిర్వహించారు. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి ఎటువంటి కోతలు, గాట్లు లేకుండా అత్యాధునిక ఎండో వాస్క్యులర్ విధానంలో చికిత్సనందించారు. అను హాస్పిటల్స్ నందు నిర్వహించిన ఈ అత్యాధునిక చికిత్స గురించి తెలియజేసేందుకు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్స్ నందు జరిగిన ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ.. అత్యాధునిక విధానంలో చికిత్సనందించి తమ హాస్పిటల్స్ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన ఎం. డాక్టర్ భవానీశంకర్ కు అభినందనలు తెలియజేశారు. మెట్రో నగరాల్లోని హాస్పిటళ్లకు మాత్రమే పరిమితమైన ఈ తరహా సంక్లిష్టమైన చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ ఎం. భవానీ శంకర్.. మన రాష్ట్ర వైద్య చరిత్రలో నూతన శకాన్ని ఆవిష్కరించారని ప్రశంసించారు. అనంతరం, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఎం. భవానీశంకర్ మాట్లాడుతూ.. "ఒడిశా రాష్ట్రానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ నొప్పికి కారణం గానీ, సమస్యకు కచ్చితమైన చికిత్స గానీ జరగలేదు. సదరు పేషెంట్ నగరంలోని అను హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం సంప్రదించారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి, రోగి ఆరోగ్య సమస్యను నిర్ధారించాం. గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం (అయోర్ట) ఉదర భాగంలో అసాధారణ స్థాయిలో ఉబ్బిపోయింది. అబ్డామినల్ అయోర్ట ఎన్యురిజంగా పిలువబడే ఈ అరుదైన సమస్య కారణంగా రోగి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహిస్తే, రక్తనాళం చిట్లిపోయి ప్రాణాపాయం సంభవించవచ్చు. అను హాస్పిటల్లోని అత్యాధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం ద్వారా రోగికి ఎండో వాస్క్యులర్ ఎన్యురిస్మల్ రిపేర్ అనే చికిత్సను నిర్వహించారు. పూర్తిగా ఎండో వాస్క్యులర్ విధానంలో ఎటువంటి కోతలు, గాట్లు లేకుండా ఈ చికిత్సను పూర్తి చేశాం. చికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకుని, తీవ్రమైన కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందారు" అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలు అను హాస్పిటల్స్ నందు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ఎం. భవానీ శంకర్ అన్నారు. అత్యంత అరుదైన చికిత్స నిర్వహించడంలో తమకు సహకరించిన వైద్య బృందానికి, అను హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీదేవి, అనస్థీషియన్ డాక్టర్ వై. గోవర్దని తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com