సేవా తత్పరతకు మారుపేరు మాగుంట

- October 15, 2024 , by Maagulf
సేవా తత్పరతకు మారుపేరు మాగుంట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయి వారిది. ప్రజా శ్రేయస్సే పరమావధిగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలు నడిపిన ఘనత ఆ కుటుంబ పెద్ద దివంగత మాగుంట సుబ్బరామి రెడ్డిది. అన్న గారిని ఆదర్శంగా తీసుకోని, ప్రజలను తమ సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, వారి కష్టనష్టాల్లో తోడుగా నిలుస్తున్నారు శీనయ్య. నేడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన ప్రజాప్రస్థానం మీకోసం....

మాగుంట శీనయ్య అలియాస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు 1953, అక్టోబర్ 15న ఉమ్మడి విశాలాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో స్వర్గీయ మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. వారి స్వస్థలం మాత్రం అదే జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామం. నెల్లూరులోని వి.ఆర్ కళాశాలలో బీకామ్ పూర్తి చేశారు. అనంతరం కుటుంబ వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తండ్రి గారైన రాఘవరెడ్డి గారు వ్యవసాయం వదిలి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆయన సివిల్ కాంట్రాక్ట్స్ మరియు లిక్కర్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో ఉండేవారు. పెద్దన్న మాగుంట సుబ్బరామి రెడ్డి గారి హయాంలో వారి  వ్యాపారాలను పలు రంగాల్లోకి విస్తరించడమే కాకుండా, దక్షిణ భారత దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అన్న గారి అడుగుజాడల్లో వ్యాపార రంగంలోకి అడుపెట్టిన శ్రీనివాసులు రెడ్డి, వ్యాపార అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ భారతదేశం వ్యాప్తంగా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

సుబ్బరామి రెడ్డి గారు కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా సేవా మూర్తిగా గుర్తింపు పొందారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టి 1991లో ఒంగోలు లోక్ సభ నుండి కాంగ్రెస్ తరుపున భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీగా  నియోజకవర్గ అభివృద్ధికి సుబ్బరామన్న పాటుపడ్డారు. 1995లో జరిగిన నక్సలైట్లు కాల్పుల్లో ఆయన మరణించారు. అప్పటి వరకు అన్న చాటు తమ్ముడిగా ఉన్న శీనయ్య, తమ కుటుంబ అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు వ్యాపారరంగాన్ని వదిలి అన్న గారి రాజకీయ వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించిన ఆయన, 2014 రాష్ట్ర విభజన తర్వాత అభిమానులు, అనుచరుల కోరిక మేరకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరుపున 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా సైతం పనిచేశారు. 2019 ఎన్నికల ముందు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే, ఆ పార్టీలో చేరిన నాటి నుండి ఆయనకు అడుగడుగునా అవమానాలు ఎదురు కావడంతో 2024లో చంద్రబాబు ఆహ్వానం మేరకు తిరిగి టీడీపీలో చేరారు. 2024లో లోక్ సభకు ఎన్నికైన తర్వాత హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.  
 
1998,2004,2009,2019,2024 లలో ఐదు సార్లు ఒంగోలు ఎంపీగా ఎన్నికైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఎంపీ లాడ్స్ నిధులతో పాటుగా తన సొంత నిధులను వెచ్చించి నియోజకవర్గవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను ఏర్పరిచారు. మాజీ సీఎం వైఎస్సార్ గారిని ఒప్పించి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సాగు, తాగు నీటి అవసరాల కోసం గుండ్లకమ్మ ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయడంలో ప్రత్యేక శ్రద్ద చూపించారు. ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా కల్వర్టులు మరియు వంతెనల నిర్మాణం, ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడి సూపర్ ఫాస్ట్ రైళ్లను ఒంగోలు, సింగరాయకొండ స్టేషన్లలో నిలుపుదల చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన తన వంతు కృషి చేస్తూనే వస్తున్నారు.

శ్రీనివాసులు రెడ్డి గారు వ్యాపార, రాజకీయాల్లో ఎంత తీరిక లేకుండా గడుపుతున్నా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహణ పట్ల అశ్రద్ధ చూపరు. అన్న సుబ్బరామి రెడ్డి గారిని నుంచి రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను వారసత్వంగా అందిపుచ్చుకున్న ఆయన వేసవిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తమ సొంత నిధులతో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయించారు. పేద విద్యార్థులకు తమ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పుస్తకాలు, బట్టలు పంపిణీ చేయడమే కాకుండా ఉపకార వేతనాలను అందిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో స్కూళ్ళు, ఇంటర్ ఎయిడెడ్ కళాశాలలను స్థాపించారు.అలాగే, జిల్లాకు లక్షలాది మంది  యువతకు తమ పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పిస్తున్నారు. వృత్తి విద్యా శిక్షణా తరగతులు, జాబ్ మేళాలు నిర్వహిస్తూన్నారు.

సుమారు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో శ్రీనివాసులు రెడ్డి గారు అజాత శత్రువుగా నిలిచిపోయారు. రాజకీయంగా ఆయనతో  విభేదించవచ్చు గాని వ్యక్తిగతంగా మాత్రం ఆయనంటే అన్ని పార్టీల నాయకులకు విశేషమైన గౌరవం. అధినేతల మెప్పు కోసం వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, లేనిపోని విమర్శలు చేయడం వంటి వాటికి ఆయన వ్యవహారశైలికి తగనివి. రాజకీయంగా తమ కుటుంబాన్ని అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శక్తివంచన లేకుండా పాటుపడుతూ వస్తున్నారు.  

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com