విలక్షణ నటుడు - బొమ్మాళీ రవిశంకర్
- November 28, 2024
నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. తండ్రి పి.జె.శర్మ, అన్న సాయికుమార్ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. నేడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ బొమ్మాళీ రవిశంకర్ పుట్టినరోజు.
బొమ్మాళీ రవిశంకర్ గా సుప్రసిద్దులైన పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి పి.జె.శర్మ, తల్లి కృష్ణజ్యోతి నటనలో రాణించిన వారే. అలా బాల్యం నుంచీ రవిశంకర్ సినిమా వాతావరణంలోనే పెరిగారు. రవిశంకర్ బాలనటునిగా ‘గోరింటాకు, ఛాలెంజ్ రాముడు, సప్తపది’ వంటి చిత్రాలలో నటించారు. అన్న సాయికుమార్ కు కన్నడ చిత్రసీమలో హీరోగా విశేషమైన గుర్తింపు లభించడంతో రవిశంకర్ కూడా అటువైపు సాగిపోయారు. అనేక కన్నడ చిత్రాలలో నటించారు. ఆ తరువాత తెలుగులోనూ రవిశంకర్ కు నటునిగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఓ వైపు నటిస్తూనే మరో వైపు డబ్బింగ్ చెబుతూ సాగారు రవి. దాదాపు 3500 అనువాద చిత్రాలలో రవిశంకర్ గాత్రం వినిపించింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మొత్తం 150 చిత్రాలలో రవిశంకర్ నటించారు.
జూనియర్ యన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’లో ప్రధాన ప్రతినాయకునిగా కనిపించిన రవిశంకర్, ‘క్రాక్’లో ఓ కామెడీ రోల్ లో అలరించారు. అంతకు ముందు మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు. కేవలం అనువాద కళాకారునిగా గాత్రం పలికించడమే కాదు, కొన్ని చిత్రాలలో తన గళాన్నీ వినిపిస్తూ పాటలు పాడారు రవిశంకర్. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ రెండు భాగాల్లోనూ రవిశంకర్ గాయకునిగా అలరించారు. ‘బెజవాడ, వంగవీటి, రాజరథం’ వంటి చిత్రాలలోనూ రవిశంకర్ పాటలు పాడారు.
మాతృభాష తెలుగులోనే కాదు పరభాషల్లోనూ రవిశంకర్ తన అభినయంతోనూ, గాత్రంతోనూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు. తెలుగు తర్వాత కన్నడంలో రవి అత్యధిక చిత్రాల్లో నటించడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో రవి ముందుకు సాగుతున్నారు
రవిశంకర్ భార్య పంజాబీ. పేరు సుచిల్. ఈ దంపతులకు అద్వేయ్ అనే కుమారుడు ఉన్నాడు. రవి డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగులో 9 నందులు, 2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. ఇక సహాయ నటుడిగా 5 ఫీలిం ఫెర్, 3 సైమా అవార్డులను అందుకున్నారు. రవి దర్శకుడిగానూ అలరించారు. 2004లో ‘దుర్గి’ అనే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు రవిశంకర్. ఈ చిత్రం తెలుగులో జూనియర్ యన్టీఆర్ హీరోగా ‘నరసింహుడు’ పేరుతో రూపొందింది. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో తనయుణ్ణి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. మునుముందు రవిశంకర్ తన నటనతోనూ, గళంతోనూ ఎలాంటి విన్యాసాలు చేస్తారో చూద్దాం.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…







