పీపుల్స్ మాస్ లీడర్-కోమటిరెడ్డి

- May 23, 2025 , by Maagulf
పీపుల్స్ మాస్ లీడర్-కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...ఈపేరు తెలియని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండరు. ఎల్లప్పుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పడం ఆయన స్టైల్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన మొదటి నాయకుడు కూడా ఆయనే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్న అతికొద్దీ మంది నాయకుల్లో కోమటిరెడ్డి ఒకరు. మూడున్నర  దశాబ్దాల రాజకీయ జీవితంలో ఐదు పర్యాయాలు ఎమ్యెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. నేడు తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం....

వెంకన్నగా సుపరిచితులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1965, మే 23న ఉమ్మడి నల్గొండ జిల్లా నార్కట్ పల్లి తాలూకా బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో కోమటిరెడ్డి వెంకట పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం, నార్కట్ పల్లిలో పూర్తి చేసిన తర్వాత 10వ తరగతి నుంచి హైదరాబాద్ నగరంలోనే చదువుకున్నారు. ప్రముఖ సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్‌గా ఎదిగారు.  

విద్యార్థిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్.ఎస్.యూ.ఐ నల్గొండ ఇంఛార్జిగా పనిచేశారు. అప్పటి జిల్లా దిగ్గజ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి  అనుచరుడిగా ఎదిగిన ఆయన యూత్ కాంగ్రెస్ విభాగంలో పనిచేస్తూనే నార్కట్ పల్లి మండల రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో చకిలం శ్రీనివాసరావు బదులు నల్గొండ నుంచి పోటీ చేసి అప్పటి తెదేపా నాయకుడు  గుత్తా సుఖేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్యెల్యే కమ్యూనిస్టు నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డిలపై సంచలన విజయం సాధించారు. తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైనప్పటికి సమస్యలపై అప్పటి అధికార తెదేపా ప్రభుత్వంపై అసెంబ్లీలో పోరాడారు.          

1999-2004 మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి తిరుగులేని యువనేతగా ఎదిగారు. దీనితో పాటుగా అప్పటి విపక్షనేత వైఎస్సార్ ప్రోత్సాహం కూడా తోడై ఆయనకు తిరుగులేకుండా పోయింది. వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్గొండలో సాగినంత కాలం వైఎస్ వెంటే ఉన్నారు. 2004 ఎన్నికల్లో సైతం నల్గొండ నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. రెండో పర్యాయంలో జిల్లాలో అప్పటి సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలతో సమానంగా జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించారు. పైగా తన సొంత నియోజకవర్గమైన నకిరేకల్ బాధ్యతలను తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ద్వారా పర్యవేక్షణ చేస్తూ వచ్చారు.

2009 ఎన్నికల్లో నల్గొండ నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించడమే కాకుండా, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని భువనగిరి నుంచి ఎంపీగా గెల్పించుకున్నారు. ఉత్తమ్, జానారెడ్డిలతో పాటుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009-11 మధ్యలో వైఎస్సార్, రోశయ్య మరియు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఐటీ. ఎయిర్ పోర్ట్స్, నౌకాశ్రయానం & సహజ వాయువు మరియు టెలీ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వంలో ఉంటూనే సానుకూలంగా మాట్లాడేవారు. ఒకానొక సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణలో ఒక్క కోమటిరెడ్డి మాత్రమే తీసుకోవడం గమనార్హం...  

2011 -14 మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో నల్గొండ నుంచి నాలుగోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో తెరాస (ఇప్పుడు భారాస) అధికారంలోకి వచ్చింది. 2014-18 వరకు అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ డిప్యూటీ లీడర్‌గా పనిచేసారు. ఆ నాలుగేళ్లలో కేసీఆర్ అండ్ కో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో సఫలం అయ్యారు. కానీ, నల్గొండ నియోజకవర్గం మీద పట్టు కోల్పోతూ వచ్చారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి మొదటిసారి ఓటమి చెందారు. అయితే, ఆయన నిలబెట్టిన చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఎంపీగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే తెలంగాణలో జరుగుతున్న అక్రమాలపై పోరాడుతూ వచ్చారు. భారాస ప్రభుత్వం చేసిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని పార్లమెంట్ సాక్షిగా చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కోరారు.

భారాస ప్రభుత్వంపై తొమ్మిదిన్నరేళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడిన కోమటిరెడ్డి 2023 ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెనర్‌గా నియమితులై ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేసులో రేవంత్ రెడ్డితో పాటుగా కోమటిరెడ్డి పేరు కూడా వినిపించింది. కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేయడంతో ఆయన మంత్రివర్గంలో రహదారులు & భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసేందుకు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.

కోమటిరెడ్డి అనగానే ఆవేశపరుడు, ముక్కోపి అని ముద్రలు వేసేశారు ఆయన ప్రత్యర్థులు. నిజానికి ఆయన చాలా భోళా మనిషి. తనను నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడరు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం ఆయనకు తెలియని విద్య. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ వాళ్ళ కుటుంబాల్లో ఒకడిగా కలిసిపోతారు. సాయం చేయమని తన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి ఏదొక విధంగా సాయపడుతునే ఉంటారు.

కోమటిరెడ్డి రాజకీయాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటారు. మెదక్ రోడ్డు ప్రమాదంలో మరణించిన కుమారుడి జ్ఞాపకార్థం  కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేసి న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో రూ.3.5 కోట్లు ఖ‌ర్చు చేసి ప్ర‌తీక్ స్మార‌క ప్ర‌భుత్వ బాలుర జూనియ‌ర్ క‌ళాశాల, బాలిక‌ల కోసం వృత్తి విద్యా నైపుణ్య క‌ళాశాల‌ను ఏర్పాటు చేసి, రోడ్డు భ‌ద్ర‌తపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి ఫౌండేష‌న్ త‌ర‌పున ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడు జాబ్ మేళాను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నారు.

మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో నీతి, నిజాయితీలే ఆరో ప్రాణంగా బ్రతుకుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. స్వశక్తితో ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు అవినీతి అంటే అసహ్యం. తెలంగాణ ప్రజానీకం సంక్షేమమే తన రాజకీయ భావజాలమని అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు.సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన కోమటిరెడ్డి స్ఫూర్తిదాయకమైన జీవితం యువ రాజకీయవేత్తలకు ఆదర్శంగా నిలుస్తుంది.    

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com