'రావు బహదూర్' సినిమా కూడా అంతేలా మెస్మరైజ్ చేస్తుంది: హీరో సత్యదేవ్

- April 16, 2026 , by Maagulf
\'రావు బహదూర్\' సినిమా కూడా అంతేలా మెస్మరైజ్ చేస్తుంది: హీరో సత్యదేవ్

జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెసెంట్స్, సత్యదేవ్, దీపా థామస్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'రావు బహదూర్' ఫస్ట్ సింగిల్ లవ్ మెలోడీ 'ఓ సుందరి' రిలీజ్  

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్,  శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్‌ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ని రిలీజ్ చేశారు.

స్మరణ్ సాయి మృదువైన స్వరాలతో, ఆహ్లాదకరమైన నేపథ్యంతో ఈ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. ఈ కంపోజిషన్ నెమ్మదిగా చిత్రంలోని వింటేజ్ భావాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. రచయిత రెహ్మాన్ భావోద్వేగంతో నిండిన పదాలతో ప్రేమలోని ఆరాధనను, మనసులోని సున్నితమైన భావాలను అందంగా వ్యక్తీకరించారు.

విజయ్ యేసుదాస్ తన హృద్యమైన వోకల్స్ తో ఈ పాటను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన స్వరం మెలోడీలో సునాయాసంగా ప్రయాణిస్తూ మధుర అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు వెంకటేశ్ మహా  అభిరుచి ఈ పాటలోని విజువల్స్ , భావోద్వేగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సత్యదేవ్, దీపా థామస్‌ల ఆకట్టుకునే ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాటకు ప్రత్యేకమైన వింటేజ్ అందం వచ్చింది.

ఈ చిత్రానికి  కార్తిక్ పార్మర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్.

అగ్రశ్రేణి నిర్మాతలు, ప్రత్యేకమైన కథన శైలితో కూడిన దర్శకుడు, అలాగే సత్యదేవ్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన నటనను కనబరిచే పాత్రలో కనిపిస్తున్న 'రావు బహదూర్' పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ‘ఓ సుందరి’ పాట వినగానే మనసుకు హాయిగా అనిపించే మెలోడీగా నిలుస్తోంది. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట సినిమా ప్రమోషన్స్‌కు మరింత జోష్ తీసుకొచ్చింది. ఓ సుందరి సాంగ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ చాలా స్పెషల్. దాదాపు ఐదేళ్ళ తర్వాత నా సినిమాకి జరుగుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ సినిమా ప్రాసెస్‌కు ఐదేళ్లు పట్టింది. ఒక రోజు కీరవాణి గారు ఫోన్ చేసి “మళ్లీ నీ సినిమా చూడాలని ఉంది, మరో సినిమా తీయవా?” అని అడిగారు. అదే రోజు అనురాగ్, శరత్ కూడా ఫోన్ చేసి నా విజన్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. మహేష్ బాబు గారు, నమ్రత గారు కథ విని ఓకే చెప్పగానే మేము మొదలుపెట్టాం. గోపాలకృష్ణ గారు రావడంతో పని ఇంకా సులభమైంది. మహేష్ గారు నమ్రత గారు, శరత్, అనురాగ్. గోపాల్ కృష్ణ గారు నాకు ఫైవ్ అవెంజర్స్.  సత్య నా క్రియేటివ్ సోల్‌మేట్. ఈ సినిమా కోసం సత్య ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. ఈ పాత్ర కోసం ముప్పై  టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సత్యలాంటి నటుడు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. దీప ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క నటుడు అద్భుతంగా చేశారు. స్మరణ్ సాయి సంగీతం సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ‘ఓ సుందరి’ పాట దానికి నిదర్శనం. ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా మీకు ఇచ్చిన అనుభూతికి పది రెట్లు అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ‘రావు బహదూర్’ తీశాను. ఈ సినిమా మీ అందరికీ మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ఓ సుందరి’ పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను సినిమాలకు వచ్చిన కొత్తలో కమల్ హాసన్ గారి లాంటి పాత్రలు ఎప్పుడైనా వస్తుందా అని అనుకునేవాడిని. ఒక రోజు వెంకటేష్ మహా ఈ కథ చెప్పారు. షూటింగ్ మొదటి రోజు ఉదయం మూడు గంటలకు సెట్‌లోకి వెళ్లి రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ చేశాను. ఇలా ఐదు రోజులు గడిచాక టెన్షన్ వచ్చి “ఇంకా ఎన్ని రోజులు ఇలా?” అని అడిగాను. దాదాపు 85 రోజులు అని చెప్పారు. అప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాను. అలాంటి సమయంలో ‘ఓ సుందరి’ పాట వినిపించారు. ఆ పాట మాకు డిటాక్స్‌లా అనిపించింది. ఈ పాట మహిళలను సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, అవతార్ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో మా రావు బహుదూర్ సినిమా కూడా మిమ్మల్ని అంతే స్థాయి లో అలరిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా మీ అందరినీ మెస్స్మరైజ్ చేస్తుంది. ఇది నా హామీ. వెంకటేష్ మహా ఒకసారి మాటిస్తే తప్పే రకం కాదు. దేశం మొత్తం తిరిగి ఈ కథ రాశాడు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మహాను సెలబ్రేట్ చేస్తారు. రామప్ప పాత్ర కోసం ప్రతిరోజూ ఐదు గంటల మేకప్ పట్టేది. సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్ గారితో కలసి నటించాను. కానీ సినిమాలో ఆ సీన్ కొన్ని కారణాల వలన ఉంచడం కుదరలేదు. ఇప్పుడు మహేష్ బాబు గారు నా సినిమాను ప్రజెంట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మా టీమ్‌కు మంచి పేరు తీసుకువస్తుంది. స్మరణ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విజయ్ గారు ఈ పాట పాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ‘రావు బహదూర్’లాంటి సినిమా ఇచ్చిన మహాకు ధన్యవాదాలు.

సింగర్ విజయ్ యేసుదాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైన ప్రాజెక్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. నిర్మాతలు, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. సత్యదేవ్ గారు అద్భుతమైన నటుడు. ఆయన నటనకు నేను అభిమానిని. ‘ఓ సుందరి’ పాట పాడటం మంచి అనుభూతి. ఇంత మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు.

ప్రొడ్యూసర్ అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మేజర్’ మా డెబ్యూ ఫిల్మ్. ఆ సినిమాకు ఐఎండీబీ అవార్డ్ వచ్చింది. ఇకపై మేము చేసే సినిమాలన్నీ ఆ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాంటి సమయంలో వెంకటేష్ మహా గారిని కలిశాం. ఆయన ‘కంచరపాలెం’ సినిమా అందరి ఫేవరెట్. ఈ సినిమాతో ఆయన మరో స్థాయికి వెళ్తారు. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. మహేష్ గారు రాజమౌళి గారు కలిసి చేస్తున్న వారణాసి సినిమాని ఎలాగైతే వరల్డ్ వైడ్ తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారో, మహేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని కూడా ఆ స్థాయిలో తీసుకువెళ్లాలని, అలాంటి సినిమాలే తీయాలని తపనతో ఉన్నారు. ఈ సినిమా చూస్తూ మీరు ‘రావు బహదూర్’ ప్రపంచంలో లీనమైపోతారు. మంచి థియేట్రికల్ అనుభూతి ఇచ్చే సినిమా ఇది. ‘ఓ సుందరి’ పాట జీవితాంతం గుర్తుండిపోతుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రావు బహదూర్’ సినిమాకి ఇది తొలి ఈవెంట్. నేను డెస్టినీ నమ్ముతాను. ఈ సినిమా కూడా డెస్టినీ ప్రకారమే జరిగింది. 2024లో వెంకటేష్ మహా గారిని కలిశాను. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నమ్రత గారికి చెప్పగా, ఆమెకు కూడా నచ్చింది. వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. మహా ఈ సినిమాను ఊహించిన విధంగా ఎవరూ ఊహించలేరు. చాలా లేయర్స్ ఉన్న కథ ఇది. చాలా గ్రాండ్‌గా తీశాం. సత్యదేవ్ గారు అద్భుతమైన నటుడు. ఈ సినిమాతో ఆయనకు మంచి బ్రేక్ వస్తుంది. ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకుని పాత్రలో ఒదిగిపోయారు. ‘ఓ సుందరి’ పాట మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. మిగతా పాటలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమా గొప్ప థియేట్రికల్ అనుభూతి ఇస్తుంది.

ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సత్యదేవ్ గారు, వెంకటేష్ మహా గారిని నమ్ముకుని ఈ సినిమా చేశాం. మహేష్ బాబు గారు, నమ్రత గారు కథను ఓకే చేయడంతో నాకు ఈ అవకాశమొచ్చింది. ఇప్పటివరకు మీరు చూసింది చిటికెడు మాత్రమే. ఇందులో ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మహా ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వస్తుంది. సత్యదేవ్ గారు పాత్రలో పూర్తిగా మునిగిపోయారు. ఆయనను గుర్తుపట్టలేం. స్మరణ్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ‘ఓ సుందరి’ పాట మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది.

హీరోయిన్ దీప థామస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి, నమ్రత గారికి, మా నిర్మాతలకు, దర్శకుడికి ధన్యవాదాలు. ఇది నాకు గోల్డెన్ అవకాశం. సత్యదేవ్ గారు వెర్సటైల్ నటుడు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. ఈ ప్రయాణంలో నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘ఓ సుందరి’ పాట ఖచ్చితంగా మీ అందరి ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఇది నా తొలి తెలుగు సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలి.

మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టీజర్‌లో మీరు చూసింది చిన్న భాగం మాత్రమే. సినిమాలో ఇంకా ఎన్నో సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ‘ఓ సుందరి’ పాటను విజయ్ గారు అద్భుతంగా పాడారు. ఆయన స్టూడియోలో పాడుతున్నప్పుడే మ్యాజికల్‌గా అనిపించింది. చాలా ప్రేమతో చేసిన పాట ఇది. సత్య గారితో ఇది నా రెండో సినిమా. ముందుకు ఇంకా మంచి కంటెంట్ తీసుకువస్తాం.

తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
DoP: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com