మార్కెట్లోకి భారీగా దొంగ నోట్లు..500, 200 నోట్లే టార్గెట్
- May 30, 2026
ముంబై: దేశంలో నకిలీ నోట్ల చలామణి అంతకంతకూ పెరిగిపోతోంది. దర్యాప్తు అధికారుల సోదాల్లో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్ల గుర్తింపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతం పెరిగిందని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన వార్షిక నివేదికలో శుక్రవారం వెల్లడించింది. మార్కెట్లోకి వస్తున్న నకిలీ నోట్లలో ప్రధానంగా రూ.200, రూ.500 ముఖ విలువ కలిగిన నోట్లే ఎక్కువగా ఉంటున్నాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
ఏడాదిలోనే 2.29 లక్షల నకిలీ నోట్ల గుర్తింపు
ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. 2025-26లో దేశవ్యాప్తంగా మొత్తంగా 2,29,746 నకిలీ నోట్లను గుర్తించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఈ సంఖ్య 2,17,396 గా ఉండేది. రూ.500 నకిలీ నోట్ల చలామణి ఏకంగా 20.5 శాతం పెరిగింది. గతంలో 1,17,722 నోట్లు గుర్తించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,41,907కి చేరింది. చిన్న నోట్లయిన రూ.20 నకిలీ కరెన్సీ చలామణి కూడా బాగా పెరిగింది. ఏడాది క్రితం కేవలం 253 నోట్లు బయటపడగా, అవి ఇప్పుడు 47.4 శాతం పెరిగి 373కి చేరాయి. రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంతో వాటి నకిలీల సంఖ్య భారీగా పడిపోయింది. గతంలో 3,508 నోట్లు బయటపడగా, 2025-26లో ఆ సంఖ్య కేవలం 824కి తగ్గింది.
మొత్తం పట్టుబడిన నకిలీ నోట్లలో ఆర్బీఐ కేవలం 2.4 శాతం (5,412 నోట్లు) మాత్రమే గుర్తించగా, ఇతర కమర్షియల్ బ్యాంకుల్లోనే అత్యధికంగా 97.6 శాతం (2,24,334 నోట్లు) బయటపడ్డాయి. అయితే, పోలీసులు మరియు ఇతర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విడిగా స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల లెక్కలను ఈ నివేదికలో ఇంకా కలపలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు, మార్కెట్ నుండి పాడైపోయిన నోట్లను ఉపసంహరించుకోవడం కూడా బాగా తగ్గిందని నివేదిక పేర్కొంది. 2024-25లో 2.38 లక్షల పాత నోట్లను తీసివేయగా, 2025-26లో ఆ సంఖ్య 1.72 లక్షల నోట్లుగా మాత్రమే నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







