రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- May 31, 2026
సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన 12 మంది పోలీసు సిబ్బందిని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ, రిటైర్ అయిన సిబ్బందికి పెన్షన్ పత్రాలు అందజేసి, పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ, ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న పోలీసు సిబ్బందిలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) ఎం.ఫజ్లూర్ రెహమాన్, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ జి. రామ్‌చందర్, చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎం. నరసింహారెడ్డి, జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ కమల్ గౌరీ సయ్యద్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ ఎం.డి. సర్దార్ బేగ్, మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ ఎం. నారాయణ, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఏఆర్‌ఎస్‌ఐలు ఎస్. నాగభూషణం, బి. రమేష్, ఎం. సుధాకర్ రెడ్డి, పి. లక్ష్మయ్య, బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పి. హుస్సేన్ పీరా మరియు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్ ఉన్నారు. వీరు తమ సుదీర్ఘ సేవా కాలంలో పోలీసు శాఖకు విశేష సేవలందించి ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.
సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సేవా భావానికి మాత్రం ముగింపు కాదని అన్నారు. పోలీస్ శాఖ అభివృద్ధికి, ప్రజల భద్రతకు తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో తన విధులను నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చిన రిటైర్డ్ పోలీసు సిబ్బంది సేవలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పోలీస్ ఉద్యోగం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని, ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించడంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో కీలకమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే తమ సుదీర్ఘ అనుభవాన్ని, విలువైన పరిజ్ఞానాన్ని యువ పోలీసు సిబ్బందితో పంచుకుంటూ, వారి వృత్తి నైపుణ్యాల పెంపొందనకు తోడ్పడాలని, పోలీసు శాఖకు అవసరమైన సందర్భాల్లో భవిష్యత్తులో కూడా తమ సహకారం అందించాలని కోరారు. రిటైర్డ్ సిబ్బందికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణం, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, సీఏఓ వెంకట్ రెడ్డి, పోలీస్ సహకార సంఘం ఇన్‌చార్జ్ జి. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







