సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త

- June 16, 2026 , by Maagulf
సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త

మోసగాళ్ల వలలో పడొద్దని దుబాయ్ పోలీసుల హెచ్చరిక

దుబాయ్: సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్న నకిలీ బీమా (ఇన్సూరెన్స్) ఆఫర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, మార్కెట్ ధరల కంటే అత్యంత తక్కువ ధరలకు బీమా అందిస్తున్నట్లు చూపిస్తూ మోసగాళ్లు ప్రజల నుంచి డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

దుబాయ్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్‌లోని యాంటీ-ఫ్రాడ్ సెంటర్, కొనసాగుతున్న #BewareofFraud అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ హెచ్చరిక జారీ చేసింది. తక్కువ ధరలకు బీమా పొందాలనే వినియోగదారుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని నకిలీ బీమా సంస్థలు, కార్యాలయాలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నాయని తెలిపింది.

మోసగాళ్లు మార్కెట్‌లో ఉన్న సాధారణ ధరల కంటే చాలా తక్కువ రేట్లకు వాహన బీమా, ఆరోగ్య బీమా వంటి సేవలను అందిస్తున్నట్లు తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తక్షణమే బీమా పాలసీలు జారీ చేస్తామని నమ్మబలికి, సంబంధిత అధికారుల అనుమతి లేదా లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించుకోకుండా వినియోగదారుల నుంచి డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారని వెల్లడించింది.

యూఏఈలో చట్టబద్ధంగా పనిచేసే బీమా సంస్థలు సంబంధిత నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో పనిచేస్తాయని, వినియోగదారుల హక్కులను రక్షించే విధంగా నిర్దిష్ట విధానాలను అనుసరిస్తాయని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ స్పష్టం చేసింది.

అందువల్ల ఏ బీమా సంస్థ లేదా బీమా బ్రోకర్‌కు చెల్లింపులు చేసే ముందు వారి లైసెన్స్‌ను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించింది. అనుమానాస్పదమైన ప్రచారాలు, అసాధారణంగా తక్కువ ధరల ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలు ఎదురైతే వెంటనే దుబాయ్ పోలీసుల eCrime ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా అత్యవసరం కాని ఫిర్యాదుల కోసం 901 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com