హీరో విరాట్ కర్ణ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- July 01, 2026
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇప్పటి వరకు మీరు చేసిన రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే.కెరీర్ ప్రారంభంలోనే ఇంత భారీ సినిమాలు చేయడం ఎలా అనిపించింది?
-అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తొలి సినిమా పెదకాపు కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఇప్పుడు నాగబంధం కూడా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను.
నాగబంధం జర్నీ ఎలా ప్రారంభమైంది?
-అభిషేక్ నామా గారు ఈ కథను సిద్ధం చేసుకుని, ఆ పాత్రకు తగ్గ నటుడి కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిపించి మాట్లాడారు. నాకు కథ చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యాను. అలా ఈ జర్నీ మొదలైంది.
ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే రూ.100 కోట్ల బడ్జెట్ అనుకున్నారా?
లేదు. సినిమా డెవలప్ చెందుతున్న కొద్దీ కంటెంట్ డిమాండ్ ప్రకారం బడ్జెట్ సైజ్ పెరుగుతూ వచ్చింది.
మీ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు?
-ఈ కథ విన్నప్పుడే నా పాత్ర ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ కథ నా కోసమే రాసినట్టుగా అనిపించింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అనిపించింది. వెంటనే పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఇందులో నాగసాధు పాత్ర మేకప్ కి ఆరు గంటల సమయం పట్టేది.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా?
అవును. ఈ సినిమాకు పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే మా దర్శకుడు చెప్పారు.
రెండో సినిమాకే ఇంత లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ రావడం ఎలా అనిపించింది?
-పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఒక నటుడికి ఇలాంటి పాత్ర రావడం గొప్ప అవకాశం. ఆ అవకాశం నాకు నాగబంధంతో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశాను.
శివరూపంలో కనిపించాలంటే చాలా ఎనర్జీ ఉండాలి కదా. ఎంత ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు?
సినిమా కథ విన్నప్పుడే రుద్ర పాత్ర ఎలా ఉండాలో పూర్తిగా అర్థమైంది. పాత్ర కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగాను. తర్వాత నాగసాధువుగా కనిపించడానికి మరో ఐదు కిలోలు తగ్గాను. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాను. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఒక శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించాను. ఆ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించాను.
బరువు పెరగడం, తగ్గడం చాలా కష్టమే కదా?
నాకు మొదటి నుంచే జిమ్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ పాత్ర కోసం సిద్ధమయ్యే ప్రక్రియ చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆ సమయంలో ఒక కండరం దెబ్బతింది. దాంతో డాక్టర్లు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు.
ఇంత భారీ సినిమా చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండేదా?
మొదట్లో కొంచెం భయపడ్డాను. ప్రతిరోజూ షూటింగ్‌లో 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ సెట్లు ఉండేవి. నమోరే పాట కోసం దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. అయితే ఆ ఒత్తిడిని మొత్తం మా దర్శకుడు అభిషేక్ నామా గారే తీసుకున్నారు. "మంచి సినిమా చేస్తున్నాం... ఇవేమీ ఆలోచించకు" అని ఎప్పుడూ ధైర్యం చెప్పేవారు.
నిర్మాతల గురించి?
నిర్మాతలు కూడా కంటెంట్‌పై నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టారు. తొలి సినిమాకే ఇంత గొప్పగా నిర్మించడం మామూలు విషయం కాదు. అలాగే ప్రమోషన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నారు.
నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ చాలా మంచి స్పందన వస్తోంది. ఆ బుకింగ్స్ చూస్తుంటే దేవుడి ఆశీస్సులు మా మీద ఉన్నాయని అనిపిస్తోంది.
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు చూసిన వారందరూ చాలా మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. అభిషేక్ నామా గారికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సన్నివేశం నాకు గూస్‌బంప్స్ కలిగించింది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తారు.
సినిమాల్లోకి రావడానికి మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు?
నాకు మెగాస్టార్ చిరంజీవి గారే ఇన్‌స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పాటలకు డాన్స్ చేసేవాడిని. అలా సినిమాలపై ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా నటుడిగా మీకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది?
-ఈ సినిమా నాలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒక నటుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాను. అభిషేక్ నామా గారు నన్ను ఒక ముత్యంలా తీర్చిదిద్దారని భావిస్తున్నాను.
షూటింగ్ సమయంలో గుర్తుండిపోయే సంఘటన?
-తీవ్రమైన చలికాలంలో షూటింగ్ చేశాం. ఒక సన్నివేశంలో పాత్ర ప్రకారం శరీరంపై ఏమీ ఉండకూడదు. ఒక యాక్షన్ సీన్ చేస్తున్నపుడు చలికి నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే నన్ను కారవాన్‌కు తీసుకెళ్లి మేకప్ తొలగించి, అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత అంతా నార్మల్‌గా ఉందని చెప్పారు. మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లిపోయాను.
ఈ పాత్ర కోసం వర్క్‌షాప్ కూడా చేశారా?
అవును. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్ చేశాం. డైలాగుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
నభా నటేష్ పాత్ర గురించి?
నభా పాత్ర ఇందులో కీలకం. ఇందులో కొన్ని సస్పెన్స్‌లు ఉన్నాయి. అవి మీరు తెరపై చూసినప్పుడే తెలుస్తాయి. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. పాటలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా వుంటాయి.
మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సినిమాలు చేయడం ఇష్టం?
నాకు మిర్చి లాంటి సినిమాలు చేయడం ఇష్టం. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫైట్స్ ఉన్న సినిమాలు చేయాలనుకుంటాను.
మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ చేశారు కదా. అక్కడ స్పందన ఎలా ఉంది?
చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్, టీజర్ చూసి ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అయ్యారు.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి బుకింగ్స్ మరింత వేగంగా పెరిగాయి.
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాత్ర కోసం నా వైపు నుంచి 100 శాతం కష్టపడ్డాను. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్‌కూ డూప్ ఉపయోగించలేదు. అన్ని యాక్షన్ సన్నివేశాలు నేనే స్వయంగా చేశాను.
కొత్త సినిమాలు గురించి?
-సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనే ప్లాన్ ఉంది. త్వరలో కొత్త సినిమాలు ప్రకటిస్తాను.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







