షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..

- July 01, 2026 , by Maagulf
షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..

దుబాయ్: దుబాయ్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు షేక్ జాయెద్ రోడ్డుకు సమాంతరంగా కొత్త ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ డెవలప్‌మెంట్ కారిడార్ నిర్మించేందుకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు.ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే పీక్ అవర్స్‌లో షేక్ జాయెద్ రోడ్డు పై ప్రయాణ సమయం 51 శాతం వరకు తగ్గుతుందని, రహదారి సామర్థ్యం గంటకు సుమారు 9,000 అదనపు వాహనాలకు పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.

దిర్హామ్ 18 బిలియన్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 15 కిలోమీటర్ల ఎలివేటెడ్ రహదారి నిర్మించనున్నారు. రెండు దిశల్లో మూడు లేన్లతో నిర్మించనున్న ఈ కారిడార్ ద్వారా అల్ బర్షా, అల్ ఖ్వోజ్, బిజినెస్ బే, మేయ్దాన్ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కల్పించడంతో పాటు సుమారు 26 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2027 మూడో త్రైమాసికంలో ప్రారంభమై, 2030 నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టుతో పాటు దుబాయ్ అభివృద్ధికి దోహదపడే పలు కీలక కార్యక్రమాలకు కూడా ఆమోదం లభించింది.

దుబాయ్ కల్చరల్ స్ట్రాటజీ 2033కు ఆమోదం తెలుపుతూ, దుబాయ్‌ను ప్రపంచ సాంస్కృతిక, సృజనాత్మక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 40 కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్థానిక, అంతర్జాతీయ కళాకారులకు ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సృజనాత్మక పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

దుబాయ్ కస్టమ్స్ స్ట్రాటజీ 2030 ద్వారా వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయడం, ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, దుబాయ్‌ను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అలాగే 'దుబాయ్ పాప్యులేషన్ నౌ' పేరుతో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత రియల్‌టైమ్ జనాభా గణన వ్యవస్థను కూడా ఆమోదించారు. నగర జనాభా మార్పులను తక్షణమే గుర్తించి గృహాలు, విద్య, ఆరోగ్యం, రవాణా వంటి రంగాల్లో సమర్థవంతమైన ప్రణాళికలకు ఇది ఉపయోగపడనుంది.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎమిరాటీల ఉపాధిని పెంచేందుకు ఎమిరాటి టాలెంట్స్ స్ట్రాటజీకి కూడా ఆమోదం లభించింది. 2033 నాటికి ప్రైవేట్ విద్యారంగంలో 3,000 మంది ఎమిరాటీలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు, సంస్థల కోసం దుబాయ్ ఇన్వెస్టర్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా వివిధ ఫ్రీజోన్లు, వ్యాపార ప్రాంతాల్లో మళ్లీ మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక నగర చిరునామా వ్యవస్థకు కొత్త విజువల్ ఐడెంటిటీని ప్రవేశపెట్టాలని కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది. 2029 నాటికి దుబాయ్‌లోని 186 ప్రాంతాల్లో ఈ కొత్త అడ్రస్ సిస్టమ్ అమల్లోకి తీసుకురానున్నారు.

అదనంగా, ఇస్లామిక్ ఫైనాన్స్‌లో సాంకేతికత, ఆవిష్కరణల కోసం గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం లభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేయనుండగా, ఇస్లామిక్ ఫిన్‌టెక్ రంగంలో దుబాయ్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com