ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్

- July 29, 2026 , by Maagulf
ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: పోలీసు శాఖ ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల సొమ్మేనని, అందువల్ల ప్రతి వ్యయం పూర్తి పారదర్శకత, బాధ్యతతో నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ల అకౌంట్స్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక బాధ్యత అనేది కేవలం ఒక అధికారిక ప్రక్రియ కాదు, అది ప్రతి అకౌంట్స్ అధికారి యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

ఇటీవల జిల్లాల పర్యటనలు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బడ్జెట్ నిర్వహణలో పలు లోపాలు తన దృష్టికి వచ్చాయని డీజీపీ తెలిపారు. కొన్ని జిల్లాల్లో జిల్లా పోలీసు అధిపతులకే తమ బడ్జెట్ పరిస్థితిపై పూర్తి అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించిందన్నారు. ఒక జిల్లాలో నిధుల విడుదల ఆలస్యం కావడంతో పోలీసు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి రావడంతో స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదని ఆయన హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో, ఆ నిధులు ఎలాంటి ఆలస్యం లేకుండా స్టేషన్ హౌస్ అధికారులకు చేరేలా అకౌంట్స్ విభాగం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

డిజిటలైజేషన్ వల్ల ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షణ మరింత బలోపేతం కావాలని, కేవలం ఎక్సెల్ షీట్లు లేదా ఆన్‌లైన్ ఫైళ్లను ముందుకు పంపడం సరిపోదని, ప్రతి బిల్లును క్షుణ్ణంగా పరిశీలించాలని అకౌంట్స్ అధికారులకు సూచించారు. చిన్న పొరపాటు కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తప్పవని, అవసరమైతే సస్పెన్షన్ లేదా ఉద్యోగం నుంచి తొలగింపు వరకు కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

అదేవిధంగా పోలీసు సంక్షేమ పథకాలు, ఆరోగ్య రక్షణ నిధులు, రుణాలు, ఇతర సంక్షేమ నిధులకు సంబంధించిన లెక్కలను అత్యంత ఖచ్చితత్వంతో, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ నిధులు నేరుగా పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల జీవితాలకు సంబంధించినవని, అందువల్ల వాటి నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని అకౌంట్స్ అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com