ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- August 16, 2026
దోహా: ఏఐ రంగంలో వేగంగా పురోగతి సాధిస్తున్న దేశాల్లో ఖతార్ కూడా చేరింది. ఏఐ సాంకేతికతను ఉత్పాదకత పెంపు, ఆవిష్కరణలు, ఆర్థిక వైవిధ్యీకరణకు వినియోగించుకునే సామర్థ్యంలో ఖతార్ ముందంజలో ఉందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గ్రూప్ విడుదల చేసిన ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2026: ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో ఖతార్‌ను ప్రపంచంలోని సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపింది. సింగపూర్, స్వీడన్, యూఏఈతో పాటు ఖతార్ కూడా ప్రపంచ ఏఐ పరిణామాల్లో కీలకంగా ఎదుగుతున్న దేశంగా పేర్కొంది.
డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, పరిశోధన, విద్య, మానవ వనరులపై ఖతార్ చేస్తున్న పెట్టుబడులు ఏఐ స్వీకరణకు బలంగా మారుతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలను ఆకర్షించడంతో పాటు దేశీయంగా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఖతార్ చర్యలు చేపడుతోందని తెలిపింది.
ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ
ఖతార్‌లో డిజిటల్ పరివర్తన కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ సేవలు, ఆరోగ్య రంగం, విద్య, పరిశోధన, వ్యాపార రంగాల్లో ఏఐ వినియోగం క్రమంగా విస్తరిస్తోంది. నాలెడ్జ్ ఆధారిత, ఆవిష్కరణలతో కూడిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంలో భాగంగా ఏఐకి ఖతార్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఏఐ వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 16.2 శాతం ఉద్యోగాలు ఉత్పాదకత లాభాలను పొందే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. అధిక ఆదాయ దేశాల్లో ఈ శాతం 18.7గా ఉంటుందని తెలిపింది. అదే సమయంలో జనరేటివ్ ఏఐ కారణంగా తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో సుమారు 4.5 శాతం ఉద్యోగాలు ఆటోమేషన్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేసింది. అధిక ఆదాయ దేశాల్లో ఈ ముప్పు 14.2 శాతం వరకు ఉంటుందని పేర్కొంది.
ఉత్పాదకత పెంచడం, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఏఐ కీలక పాత్ర పోషించగలదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం కంటే.. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఏఐని వినియోగించడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రయోజనకరమని తెలిపింది.
గల్ఫ్ ప్రాంతంలోని దేశాలు అధునాతన డిజిటల్ మౌలిక వసతులు, పరిశోధన-అభివృద్ధిలో పెట్టుబడులు, ఏఐ నైపుణ్యాల లభ్యతతో ప్రయోజనం పొందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో ఖతార్ సాధిస్తున్న పురోగతి.. దేశ ఆర్థిక వైవిధ్యీకరణకు మరింత ఊతమివ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







