ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు రోజుకు Dh80కే రెంట్ కార్స్..!!
- August 18, 2026
అబుదాబి: ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు ఇకపై రోజుకు Dh80 నుంచి Dh200 వరకు కార్లను అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. ఈ సేవలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. అలాగే ఇంధన ఖర్చు కూడా అద్దె మొత్తంలోనే ఉంటుంది. ప్రతి బుకింగ్‌లో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు.
అబుదాబి, ఫుజైరా రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చిన ‘రైల్ టు రోడ్’ సేవను థ్రిఫ్టీ కార్ రెంటల్ సంస్థ ‘ఫ్లెక్సీ’ పేరుతో నిర్వహిస్తోంది. రైలు ప్రయాణం ముగిసిన తర్వాత తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు వాహనం అవసరమైన ప్రయాణికులకు ఈ సేవ ఉపయోగపడనుంది.
ఈ ప్యాకేజీల్లో ముందుగానే చెల్లించిన ఇంధనంతో పాటు 60 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. అదనపు కిలోమీటర్లకు ప్రత్యేక ఛార్జీలు చెల్లించి ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నట్లు థ్రిఫ్టీ తెలిపింది.
మూడు కేటగిరీల్లో కార్లు
ప్రారంభ దశలో మూడు రకాల వాహనాలను అందుబాటులో ఉంచారు. ఎసెన్షియల్ కేటగిరీలో టయోటా యారిస్, బాలెనో, హ్యుందాయ్ యాక్సెంట్ వంటి చిన్న కార్లు ఉన్నాయి.
కంఫర్ట్ కేటగిరీలో మాజ్డా CX-3, హ్యుందాయ్ క్రెటా, మాజ్డా 6 వంటి పెద్ద సెడాన్లు, కాంపాక్ట్ SUVలు అందుబాటులో ఉన్నాయి.
స్ట్రెచ్ కేటగిరీలో ఆడి A3, మాజ్డా CX-90, జీప్ చెరోకీ, నిస్సాన్ పెట్రోల్, జీప్ రాంగ్లర్ వంటి ప్రీమియం వాహనాలను అందిస్తున్నారు.
స్టేషన్‌లోనే బుక్ చేసుకునే అవకాశం
కారు అద్దెకు తీసుకునే ముందు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లింపు కార్డులను టోకెనైజ్ చేసి లావాదేవీలు నిర్వహిస్తామని థ్రిఫ్టీ తెలిపింది. అంతేకాకుండా ముందస్తు బుకింగ్‌కు కనీస గడువు కూడా లేదు. ప్రయాణికులు రైలు ప్రయాణానికి ముందే కారును బుక్ చేసుకోవచ్చు. స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. వాక్-ఇన్ కస్టమర్లకు కూడా వాహనాలు అందుబాటులో ఉంటాయి.
కారు అద్దె వ్యవధిని రైలు రాకపోకల సమయాలకు అనుసంధానం చేయకుండా 24 గంటల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. దీంతో రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు వచ్చినా ప్రయాణికులకు సౌలభ్యం ఉంటుందని సంస్థ తెలిపింది.
సాధారణంగా ప్రయాణికులు ఏ స్టేషన్‌లో కారును తీసుకుంటారో అదే స్టేషన్‌లో తిరిగి అప్పగించేలా ఈ సేవను రూపొందించారు. అయితే అవసరమైతే థ్రిఫ్టీకి చెందిన మరో ప్రాంతీయ కేంద్రంలోనూ కారును తిరిగి అప్పగించవచ్చు. ఇందుకు నామమాత్రపు వన్-వే ఛార్జీ వర్తిస్తుంది.
రైలు టికెట్ బుకింగ్‌తోనే కారు బుకింగ్
కారు అద్దె సేవను ఇప్పటికే ఎతిహాద్ రైల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగం చేశారు. రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే కారు అద్దెకు తీసుకునే ఆప్షన్ ప్రయాణికులకు కనిపిస్తుంది. ఎతిహాద్ రైల్, థ్రిఫ్టీ మధ్య ఐదేళ్ల ప్రత్యేక భాగస్వామ్యంలో భాగంగా రైల్ టు రోడ్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రయాణికులకు రైల్వే స్టేషన్ల నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఫస్ట్-మైల్, లాస్ట్-మైల్ రవాణా సదుపాయం కల్పించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు.
ఐదేళ్లలో Dh10 మిలియన్లకు పైగా పెట్టుబడి
ఈ భాగస్వామ్యంలో భాగంగా ఐదేళ్లలో Dh10 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాలని థ్రిఫ్టీ నిర్ణయించింది. వాహనాల సంఖ్య పెంపు, డిజిటల్ సదుపాయాలు, కస్టమర్ సేవల మెరుగుదలకు ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రారంభంలో సుమారు 500 వాహనాలను అందుబాటులో ఉంచి, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సంఖ్యను పెంచనున్నారు.
ఎతిహాద్ రైల్‌కు చెందిన 11 ప్యాసింజర్ స్టేషన్లలో డిజిటల్ కియోస్క్‌లు, సహాయక డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఎతిహాద్ రైల్, థ్రిఫ్టీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బుకింగ్ సదుపాయం కల్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- కువైట్‌లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!
- లైసెన్స్ లేకుండా నగదు బదిలీలు.. ఆసియా ప్రవాసుడు అరెస్ట్..!!
- ఫ్యాషన్ సంస్థకు BD2,300 చెల్లించాలని కోర్టు ఆదేశం..!!
- లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. సౌదీలో కొత్త నిబంధనలు..!!
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు రోజుకు Dh80కే రెంట్ కార్స్..!!
- దుబాయ్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం GDRFA ప్రత్యేక ఏర్పాట్లు
- మరణశిక్ష కోసం విషపూరిత ఇంజెక్షన్ పద్ధతిని నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే
- అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు







