8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్‌ఏలో చోటు
- August 28, 2026
డల్లాస్: చిన్న వయసులోనే చదరంగంలో అసాధారణ ప్రతిభను చాటుతూ తెలుగు కుటుంబానికి చెందిన 8 ఏళ్ల సరయు తలపనేని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన క్లాసికల్ చెస్ పాన్-అమెరికన్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ యూఎస్‌ఏ తరఫున పాల్గొన్న సరయు స్వర్ణ పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
వారం రోజుల పాటు జరిగిన ఈ పోటీలో సరయు 9 రౌండ్లలో 9 విజయాలు సాధించి 9/9 పర్ఫెక్ట్ స్కోర్ నమోదు చేసింది. ఉత్తర, దక్షిణ, మధ్య అమెరికాకు చెందిన ఏడు దేశాల అగ్రశ్రేణి క్రీడాకారులతో పోటీ పడి, తన విభాగంలో తిరుగులేని కాంటినెంటల్ ఛాంపియన్‌గా నిలిచింది.
టీమ్ యూఎస్‌ఏలో అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా సరయు నిలవడం మరో విశేషం. ఈ విజయంతో ఈ ఏడాది చివర్లో జరగనున్న యూత్ చెస్ ప్రపంచ కప్‌లో అమెరికాస్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు లభించింది. అంతేకాకుండా అధికారిక FIDE విమెన్ కాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్‌ను తాత్కాలికంగా పొందిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా సరయు గుర్తింపు పొందింది.
డల్లాస్‌లో ఘన స్వాగతం
పాన్-అమెరికన్ పోటీ ముగించుకుని డల్లాస్‌కు తిరిగి వచ్చిన సరయుకు కుటుంబ సభ్యులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఆమె విజయంపై స్థానికంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. Fox 4 Newsతో పాటు ఇర్వింగ్, ఫ్రిస్కో నగరాల మేయర్లు, స్థానిక నాయకులు సరయును అభినందించారు.
అమెరికా జాతీయ మహిళల చెస్ ఛాంపియన్‌గా నాలుగుసార్లు నిలిచిన కరిస్సా యిప్, ప్రముఖ చెస్ ప్రచారకుడు సాగర్ షా నుంచి అభినందనలు అందుకోవడం సరయుకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ చెస్‌మేట్ కార్యక్రమంలో ఆమె వారిద్దరినీ కలిసింది.
ఐదేళ్ల వయసులో మొదలైన ప్రయాణం
సరయు ఐదేళ్ల వయసులో కాపెల్ చెస్ క్లబ్‌లో గ్రూప్ చెస్ తరగతులకు హాజరు కావడం ప్రారంభించింది. తొలుత చెస్‌ను కూచిపూడి, పియానో, ఆర్ట్, జిమ్నాస్టిక్స్ వంటి ఇతర కార్యకలాపాల మాదిరిగానే ఒక సరదా కార్యక్రమంగా మాత్రమే చూసేది.
అయితే ఓ స్థానిక చెస్ టోర్నమెంట్‌లో ఆమె ఆటను గమనించిన అనిల్ గుట్లా.. సరయులో అసాధారణ ప్రతిభ ఉందని ఆమె తల్లి లక్ష్మికి సూచించారు. ఆమెకు ప్రత్యేక వ్యక్తిగత శిక్షణ అవసరమని చెప్పారు.
దీంతో కుటుంబ సభ్యులు పరిశోధించి భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మాస్టర్, యూటీ డల్లాస్‌లో చెస్ స్కాలర్‌షిప్‌పై చదువుతున్న సక్షం రౌటెలాను సంప్రదించారు. సరయు ఆటను పరిశీలించిన సక్షం.. సరైన శిక్షణ, ఏకాగ్రతతో ఆమె అత్యున్నత స్థాయికి ఎదగగలదని గుర్తించారు.
కఠిన శిక్షణతో అంతర్జాతీయ విజయాలు
కొంతకాలం వివిధ కోచింగ్ విధానాలను ప్రయత్నించిన అనంతరం సరయుకు మరింత అంకితభావంతో కూడిన ప్రత్యేక శిక్షణ అవసరమని తల్లిదండ్రులు గుర్తించారు. గత వేసవిలో సక్షం రౌటెలా సూచనతో సరయు ప్రస్తుత కోచ్ వద్ద శిక్షణ ప్రారంభించింది.
పాఠశాల అనంతరం ప్రతిరోజూ గంటసేపు చెస్ శిక్షణ తీసుకోవడం, వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం ఆమె దినచర్యగా మారింది. డీఎఫ్‌డబ్ల్యూ ప్రాంతంతో పాటు టెక్సాస్‌లోని వివిధ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొంటూ సరయు తన ఆటతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఓర్పును కూడా పెంచుకుంది.
అమెరికాలో నంబర్ వన్.. ప్రపంచంలోనూ అగ్రస్థానం
సరయు ప్రతిభకు మరో గుర్తింపుగా డిసెంబర్ 2025 నాటికి అమెరికాలో 7 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికల విభాగంలో నంబర్-1 ర్యాంక్ సాధించింది.
అదే విధంగా 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు అండర్-8 విభాగంలో పోటీపడేందుకు అర్హత ఉన్న బాలికలలో FIDE రేటింగ్ ప్రకారం ప్రపంచ నంబర్-1 స్థానాన్ని కూడా సరయు దక్కించుకుంది.
చదువుతో పాటు చదరంగం
ప్రపంచవ్యాప్తంగా తన వయసు గల పలువురు అగ్రశ్రేణి యువ చెస్ క్రీడాకారులు పూర్తిస్థాయి చెస్ శిక్షణపై దృష్టి పెడుతున్నప్పటికీ, సరయు మాత్రం తన చదువును కొనసాగిస్తూ చెస్‌లో రాణిస్తోంది.
డల్లాస్‌లోని గ్రేట్ హార్ట్స్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న సరయు ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ, పాఠశాల తర్వాత చెస్ శిక్షణ తీసుకుంటోంది. చెస్‌పై పెరిగిన నిబద్ధత కారణంగా గత ఏడాది కూచిపూడి తరగతులకు కొంతకాలం విరామం ఇచ్చింది. అయితే వారానికి ఒకసారి పియానో తరగతులను కొనసాగిస్తోంది. ఇటీవల వేసవి సెలవుల్లో తైక్వాండో శిక్షణ కూడా ప్రారంభించింది.
హైదరాబాద్–గన్నవరం నుంచి డల్లాస్ వరకు
సరయు విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌ల సహకారం కీలకంగా నిలిచింది. సరయు తండ్రి హైదరాబాద్‌కు చెందినవారు, తల్లి గన్నవరానికి చెందినవారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్ వేదికపై అద్భుత విజయాన్ని అందుకున్న సరయు తలపనేని.. తెలుగు కుటుంబానికి, అమెరికాలోని భారతీయ సమాజానికి గర్వకారణంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారిణిగా ఎదగాలని సరయు కుటుంబ సభ్యులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్‌ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







