వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- September 03, 2026
న్యూ ఢిల్లీ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నూటికి నూరు శాతం ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన ముందుచూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల స్థాయికి చేరుకుందని అన్నారు.
రైతులు పండించే పంటలకు మద్దతు ధర అందించే చర్యలను తొలిసారిగా చేపట్టిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించేందుకు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చామని తెలిపారు. పేదలకు అసైన్డ్ భూములు పంచడం, ప్రజలకు నిత్యావసర సరుకులను రేషన్ వ్యవస్థ ద్వారా అందించడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుతం 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, దీనికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.
రైతుల కోసం వైఎస్ కీలక నిర్ణయాలు
రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రేవంత్ రెడ్డి కొనియాడారు. అప్పట్లో రూ.1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడంతో పాటు రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారి గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
తెలంగాణలో సాగునీటి విస్తరణకు ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని పేర్కొన్నారు.
వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ప్రస్తుతం నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ చివరి కోరిక నెరవేర్చాలి
వైఎస్ అభిమానులకు ఆయన చివరి కోరికను గుర్తుచేస్తూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని పేర్కొన్నారు.
అయితే ఆ కోరిక నెరవేరకముందే వైఎస్ మరణించారని అన్నారు. దేశ ప్రజలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలిచే బలమైన నాయకత్వం అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ద్వారా వైఎస్ చివరి కోరికను నెరవేర్చాలని కాంగ్రెస్ శ్రేణులకు, వైఎస్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఇందుకు అందరి మద్దతు అవసరమని పేర్కొంటూ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







