అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్‌ లకు అనుమతి..!!

- September 04, 2026 , by Maagulf
అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్‌ లకు అనుమతి..!!

మనామా: బహ్రెయిన్‌లోని చారిత్రక అరాద్ కోట సముద్రతీర ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ కియోస్క్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అనుమతి లభించింది. ఈ ప్రతిపాదనపై మున్సిపాలిటీస్ అఫైర్స్ అండ్ అగ్రికల్చర్ మంత్రిత్వ శాఖ ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని ముహర్రక్ మున్సిపాలిటీకి సూచించారు. కియోస్క్‌ల నిర్మాణం, నిర్వహణ విధానాలపై బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ ఆంటిక్విటీస్, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలతో కలిసి మున్సిపాలిటీ పనిచేయనుంది.


మున్సిపాలిటీస్ అఫైర్స్ అండర్‌సెక్రటరీ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ..  ఈ పథకం పట్టణ ప్రణాళిక, ఇతర నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అధ్యయనం ద్వారా నిర్ధారిస్తామని తెలిపారు. అరాద్ కోట సముద్రతీర వాకింగ్ మార్గం వెంట కియోస్క్‌లను ఏర్పాటు చేసి, స్థానిక మరియు చిన్నతరహా చేతి వృత్తుల కుటుంబాలు తమ ఉత్పత్తులను సందర్శకులకు నేరుగా విక్రయించే అవకాశం కల్పించాలని ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ గతంలో ప్రతిపాదించింది.

కౌన్సిలర్ అహ్మద్ అల్ మకాహ్వీ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురాగా, కౌన్సిల్ సేవలు, ప్రజా వినియోగాల కమిటీ మెజారిటీ సభ్యులు దీనికి మద్దతు తెలిపారు. కియోస్క్‌ల ఏర్పాటు ద్వారా ఇంటి నుంచే వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాలకు అదనపు విక్రయ వేదిక లభిస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే, వాకింగ్ మార్గాన్ని ఉపయోగించే సందర్శకులకు మరిన్ని షాపింగ్, సేవా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సముద్రతీర ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో పాటు, చిన్న ఉత్పత్తిదారులు వినియోగదారులను నేరుగా చేరుకునే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.

చారిత్రక అరాద్ కోట సమీపంలోని ఈ సముద్రతీర వాకింగ్ మార్గం ముహర్రక్‌లో అత్యంత రద్దీగా ఉండే బహిరంగ ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడకు నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో, ఉత్పాదక కుటుంబాల కియోస్క్‌ల ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశాలపై అధికారులు అధ్యయనం చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com