Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- September 05, 2026
అబుదాబి: అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్న వ్యక్తికి అబుదాబి కోర్టు షాక్ ఇచ్చింది. రుణంగా తీసుకున్న Dh120,000 మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడంతో పాటు, రుణదాతకు కలిగిన ఇబ్బందులు, మానసిక వేదనకు పరిహారంగా మరో Dh15,000 చెల్లించాలని ఆదేశించింది.
అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. కోర్టు రికార్డుల ప్రకారం.. రుణదాత రెండు విడతల్లో డబ్బును బదిలీ చేశాడు. తొలుత Dh20,000, ఆ తర్వాత Dh100,000 చెల్లించాడు. అనుకోని అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో డబ్బు అవసరమైందని, తిరిగి చెల్లిస్తానని రుణగ్రహీత హామీ ఇచ్చినట్లు రుణదాత కోర్టుకు తెలిపాడు.
అయితే గడువు వచ్చిన తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించకుండా ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించకుండా తప్పించుకోవడం ప్రారంభించాడని ఆరోపించాడు. దీంతో రుణదాత చివరకు కోర్టును ఆశ్రయించి Dh120,000 రుణం తిరిగి చెల్లించడంతో పాటు, తన డబ్బును ఉపయోగించుకోలేకపోవడం వల్ల కలిగిన నష్టానికి పరిహారం కోరాడు.
కోర్టులో కీలక ఆధారాలు
తన వాదనకు మద్దతుగా రుణదాత రెండు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రసీదులను కోర్టుకు సమర్పించాడు. అలాగే ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఆధారాలుగా సమర్పించాడు.
ఆ మెసేజ్‌లలో రుణగ్రహీత తాను డబ్బు అందుకున్న విషయాన్ని అంగీకరించడంతో పాటు, పలుమార్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది. ఆ తర్వాత మాత్రం రుణదాత నుంచి వచ్చిన డిమాండ్లను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పేర్కొంది.
విచారణ సందర్భంగా రుణగ్రహీత కూడా తాను పూర్తి Dh120,000 అందుకున్నట్లు అంగీకరించాడు. అత్యవసర పరిస్థితి కారణంగానే ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నానని, తిరిగి చెల్లించే ఉద్దేశం తనకు ఎప్పుడూ ఉందని తెలిపాడు.
అయితే రుణాన్ని ఏ నిర్దిష్ట తేదీన తిరిగి చెల్లించాలనే ఒప్పందం ఇద్దరి మధ్య జరగలేదని వాదించాడు. తాను చెల్లించడానికి నిరాకరించలేదని, తర్వాత ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రుణం తీర్చలేకపోయానని కోర్టుకు వివరించాడు. అసలు రుణం Dh120,000కు మించి ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని, పరిహారం కోసం చేసిన డిమాండ్‌ను కూడా తిరస్కరించాలని కోరాడు.
రుణం తిరిగి చెల్లించాల్సిందే
అయితే రుణగ్రహీత స్వయంగా చేసిన అంగీకారం, బ్యాంకు బదిలీ రసీదులు, వాట్సాప్ సందేశాలు పరిశీలించిన కోర్టు.. Dh120,000 రుణం తీసుకున్న విషయం, అది ఇంకా చెల్లించకుండా ఉన్న విషయం స్పష్టంగా రుజువైందని పేర్కొంది.
చట్టబద్ధమైన కారణం లేకుండా మరొకరి డబ్బును తన వద్ద ఉంచుకునే హక్కు ఎవరికీ లేదని, అందుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
అదే సమయంలో డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉంచడం వల్ల రుణదాత ఆ మొత్తాన్ని వినియోగించుకునే అవకాశం కోల్పోయాడని, దీనివల్ల అతడికి మానసిక ఇబ్బందులు, వేదన కలిగాయని కోర్టు పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని Dh120,000 అసలు రుణంతో పాటు Dh15,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







