ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన షేక్ హమ్దాన్

- September 10, 2026 , by Maagulf
ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన షేక్ హమ్దాన్

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ ఇండస్ట్రియల్ సిటీలోని ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ కేంద్రం ప్రాంతంలోని అతిపెద్ద ఔషధ గిడ్డంగుల్లో ఒకటిగా ఉంది.

ఈ సందర్భంగా షేక్ హమ్దాన్ మాట్లాడుతూ, సమర్థవంతమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్మాణం, అభివృద్ధిలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఔషధాలు, వైద్య సామగ్రిని నాణ్యంగా అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ అలీషా మూఫెన్ ఈ సందర్భంగా షేక్ హమ్దాన్‌కు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కార్యకలాపాలను వివరించారు. 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం ద్వారా యూఏఈతో పాటు జీసీసీ దేశాల్లోని ఆస్టర్ నెట్‌వర్క్‌కు ఔషధాలు, వైద్య సామగ్రి సరఫరా జరుగుతోందని తెలిపారు.

ఆధునిక సాంకేతికత, వినూత్న విధానాలను ఉపయోగించడం ద్వారా ఔషధాల పంపిణీలో వేగం, ఖచ్చితత్వం, సామర్థ్యం పెరుగుతున్న తీరును షేక్ హమ్దాన్ పరిశీలించారు. కేంద్రం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఆయన అభినందించారు. ఆస్టర్ సంస్థ తన సేవలను మరింత విస్తరించడంతో పాటు ఆధునిక పరిష్కారాలను స్వీకరించి యూఏఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆయన మద్దతు తెలిపారు.

ఈ పర్యటనలో యూఏఈ కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్స్ శాఖ సహాయ మంత్రి ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా, దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ హెలాల్ సయీద్ అల్ మర్రీ, టీకామ్ గ్రూప్ చైర్మన్ మాలెక్ అల్ మాలెక్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ప్రతిరోజూ సుమారు 75,000 లావాదేవీలు నిర్వహిస్తున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఆస్టర్ నెట్‌వర్క్‌లో 350 ఫార్మసీలు, 120 మెడికల్ క్లినిక్‌లు, 15 ఆసుపత్రులు ఉన్నాయి. ఈ విస్తృత నెట్‌వర్క్‌కు అవసరమైన ఔషధాలు, వైద్య సామగ్రి సరఫరాలో దుబాయ్‌లోని ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కీలకంగా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com