గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- September 24, 2026
115 దేశాల విద్యార్థులతో గ్లోబల్ కోహార్ట్.. తొలి వెటర్నరీ బ్యాచ్‌కు ప్రత్యేక కార్యక్రమం
అజ్మాన్: గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (GMU) 2026 విద్యా సంవత్సరానికి కొత్తగా చేరిన విద్యార్థులకు వైట్ కోట్ సెరిమనీని అజ్మాన్‌లోని థంబే గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది కొత్త ప్రవేశాలతో యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 115 దేశాలకు చెందిన విద్యార్థులు GMUలో విద్యను అభ్యసించిన ఘనతను సాధించింది.
ఉదయం, మధ్యాహ్నం జరిగిన కార్యక్రమాలకు థంబే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. థంబే మొయిదీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మంద వెంకటరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
కొత్త విద్యార్థులను ఉద్దేశించి డా. థంబే మొయిదీన్ మాట్లాడుతూ, “గల్ఫ్‌లోని అగ్రశ్రేణి యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ మెడికల్ యూనివర్సిటీలలో ఒకటిగా ఎదిగాం” అని అన్నారు.
వైట్ కోట్ సెరిమనీ విజయానికి ముగింపు కాదని, విద్యార్థుల వైద్య ప్రయాణానికి ఇది ప్రారంభమని ప్రొఫెసర్ మంద వెంకటరమణ పేర్కొన్నారు. వైట్ కోట్ ధరించడం వల్ల ఎవరూ వైద్య నిపుణులు కాలేరని, మెరుగైన ప్రశ్నలు అడుగుతూ నేర్చుకునే సంవత్సరాలే వారిని వైద్యులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు. విద్యార్థులు ఆసక్తిని కొనసాగించాలని, తమకు తెలియని విషయాలను నిజాయితీగా అంగీకరించాలని, శాస్త్రీయ పరిజ్ఞానం మానవీయత కంటే ముందుకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్, అనస్థీషియా టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ సైన్సెస్, ఆడియాలజీ అండ్ స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ, ఆప్టోమెట్రీ, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, ఏఐ ఇన్ హెల్త్‌కేర్ తదితర కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ సందర్భంగా ప్రమాణం చేశారు.
డాక్టర్ ఆఫ్ మెడిసిన్, గ్రాడ్యుయేట్ ఎంట్రీ MD, బయోమెడికల్ సైన్స్, థంబే ఇంటర్నేషనల్ పాత్‌వే ప్రోగ్రామ్ విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అజ్మాన్‌కు రాలేకపోయిన విద్యార్థుల కుటుంబ సభ్యులు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు.
UAEలో తొలి వెటర్నరీ వైట్ కోట్ సెరిమనీ
GMUలోని డాక్టర్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ (DVM) విద్యార్థుల కోసం ప్రత్యేక వైట్ కోట్ కార్యక్రమం కూడా నిర్వహించారు. వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖలో యానిమల్ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డా. కల్తమ్ అలీ కయాఫ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వైట్ కోట్లు అందజేశారు. ఇది UAEలో ఈ తరహాలో నిర్వహించిన తొలి వెటర్నరీ వైట్ కోట్ సెరిమనీగా పేర్కొన్నారు. కార్యక్రమానికి డా. థంబే మొయిదీన్ అధ్యక్షత వహించారు.
త్వరలో థంబే మెడిసిటీ ప్రాంగణంలో థంబే వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభం కానుంది. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యాన్ని వేర్వేరు విభాగాలుగా కాకుండా ఒకే సమగ్ర వ్యవస్థగా చూడాలనే విధానాన్ని GMU అనుసరిస్తోంది. విద్యార్థులకు ప్రారంభ దశ నుంచే ఈ మూడు రంగాల పరస్పర సంబంధాలపై అవగాహన కల్పిస్తోంది.
మొదటి సంవత్సరం నుంచే క్లినికల్ అనుభవం
GMUలో విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే క్లినికల్ వాతావరణంలో అనుభవం కల్పిస్తున్నారు. థంబే యూనివర్సిటీ హాస్పిటల్, థంబే రిహాబిలిటేషన్ హాస్పిటల్, థంబే ల్యాబ్స్‌తో పాటు విస్తృత థంబే హెల్త్‌కేర్ నెట్‌వర్క్ ద్వారా విద్యార్థులకు క్లినికల్ ఎక్స్‌పోజర్, సిమ్యులేషన్ ఆధారిత శిక్షణ, పరిశోధన మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
1998లో అజ్మాన్‌లో స్థాపించబడిన గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీలలో ఒకటిగా ఎదిగింది. 115 దేశాలకు చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో అంతర్జాతీయ గుర్తింపును సాధించింది.
థంబే గ్రూప్‌లో భాగమైన GMUలో మెడిసిన్, డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్, హెల్త్ సైన్సెస్, వెటర్నరీ మెడిసిన్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, ఏఐ ఇన్ హెల్త్‌కేర్ తదితర రంగాల్లో విద్యను అందిస్తున్నారు. క్లినికల్ శిక్షణ కోసం థంబే హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లో 3,100 పడకలు అందుబాటులో ఉన్నాయి.


తాజా వార్తలు
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు
- షూటింగ్లో ఆరో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!







