దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక

- October 08, 2026 , by Maagulf
దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక

వెండి పట్టు దారాలతో ముగ్గురు రాజుల ముఖచిత్రాలు.. 26 గ్రాముల వెండితో అపురూప కళాఖండం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అద్భుతమైన చేనేత కళా నైపుణ్యంతో మరో అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల సందర్భంగా దుబాయ్ రాజుకు అందించేందుకు ప్రత్యేకమైన కానుకను సిద్ధం చేశారు.

చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హరిప్రసాద్‌కు దుబాయ్ రాజు కోసం అరుదైన కానుకను తయారు చేయాలని ఆర్డర్ రావడంతో, తన సృజనాత్మకతను జోడించి ఈ ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించారు. వెండి పట్టు దారాలను ఉపయోగించి ముగ్గురు రాజుల ముఖచిత్రాలను చేనేత వస్త్రంపై అద్భుతంగా పొందుపరిచారు.

సుమారు రెండు మీటర్ల పొడవు కలిగిన ఈ కళాఖండంలో 26 గ్రాముల వెండిని వినియోగించారు. ఈ ప్రత్యేక డిజైన్‌ను రూపొందించేందుకు సుమారు 15రోజుల సమయం పట్టగా, మగ్గంపై నేయడానికి  18 నుంచి 20 గంటల పాటు ఏకధాటిగా శ్రమించినట్లు హరిప్రసాద్ తెలిపారు. చేనేత మగ్గంపై వెండి పట్టు దారాలతో రాజుల ముఖచిత్రాలను సజీవంగా ఆవిష్కరించడం ఈ కళాఖండానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ఎన్నో అరుదైన కళా సృష్టులకు చిరునామా

వెల్ది హరిప్రసాద్ గతంలో కూడా తన చేనేత ప్రతిభతో అనేక ప్రత్యేక కళాఖండాలను రూపొందించారు. వాసవి దేవి అమ్మవారి చరిత్రను ఒకే చీరపై అద్భుతంగా పొందుపరిచి చేనేత కళలో తన ప్రతిభను చాటుకున్నారు.

అలాగే 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి రికార్డు సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు. హరిప్రసాద్ చేనేత కళా ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 95వ ఎపిసోడ్‌లో ఆయన చేనేత కళా ప్రతిభకు ప్రశంసలు లభించాయి.

సిరిసిల్ల చేనేత కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో హరిప్రసాద్ చేస్తున్న వినూత్న ప్రయోగాలు చేనేత కళాకారుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com