ఏపీ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా గౌతమి శ్వేత

- October 14, 2026 , by Maagulf
ఏపీ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా గౌతమి శ్వేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మరో నామినేటెడ్ పదవిని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ మహిళా కమిషన్ మెంబర్‌గా స్వాతిరెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అయింది. ఈ నిర్ణయంపై టీడీపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగిందంటూ ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ లీడర్స్, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అసలు ఎవరీ స్వాతిరెడ్డి...
అసలు పేరు గౌతమి శ్వేత.. ఈమె స్వాతిరెడ్డి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను, అప్పటి అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టేవారు. విమర్శించే వారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ, ఫోటోలు మార్ఫింగ్‌తో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. అప్పట్లో ఆమె చాలా వేధింపులను ఎదుర్కొన్నారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా టీడీపీ ఆలోచనలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు కృషి చేశారు. బెదరు లేకుండా.. భయపడకుండా... స్థిరంగా ఆమె అనుకున్నదానిపై నిలబడి ముందుకు కదిలారు.

టీడీపీ కార్యకర్తల హర్షం...
పదవి దక్కిన సందర్భంగా గతంలో స్వాతి రెడ్డి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ ఆమె ఏ మాత్రం భయపడకుండా తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లారని ఆ పార్టీ వర్గీయులు అంటున్నారు. అప్పుడు ఆమె ప్రదర్శించిన ధైర్యానికి ఇప్పుడు సముచిత గౌరవం దక్కిందని స్వాతిరెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఆమె మీద జరిగిన కుట్రలను ఛేదించి టీడీపీలో కీలక పాత్ర పోషించినందుకే పదవి దక్కిందని టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా స్వయంగా ఆమె సైబర్ వేధింపులు ఎదుర్కొన్నారు కాబట్టి.. సామాజిక మాధ్యమాల్లో మహిళల పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుందని, మహిళలను కించపరిచే విధంగా చేసే కామెంట్లు, ట్రోలింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు ఆమె బాధ్యతలు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com