మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం

- October 14, 2026 , by Maagulf
మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా నాలాసోపారా ప్రాంతంలోని ఒక హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. 8వ అంతస్తులో ప్రారంభమైన ఈ మంటలు చూస్తుండగానే 10వ అంతస్తు వరకు వ్యాపించాయి. దట్టమైన పొగ, నిప్పురవ్వలతో అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బయటకు పరుగులు తీశారు.

ఇద్దరు మహిళలు దుర్మరణం.. 15 మంది సురక్షితం
నలసోపారా–వసాయి లింక్ రోడ్డులోని ‘ఇంపీరియల్ హైట్స్’ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసు, స్థానిక పరిపాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఫల్గుణి షా (50), అశ్విని పార్కర్ (50) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్లో చిక్కుకున్న 15 మందిని సురక్షితంగా బయటకు రక్షించారు.

షార్ట్ సర్క్యూట్‌యే కారణమా?
భవనంలోని 8వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, మంటలు వ్యాపించడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని రెస్క్యూ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com