ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- October 15, 2026
దోహా: వ్యాపారం, విద్య, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, ప్రభుత్వ సేవలు సహా వివిధ రంగాల్లో ఖతార్ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని గ్రేట్ ప్లేస్ టు వర్క్ మిడిల్ ఈస్ట్ సంస్థ ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్ మేనేజింగ్ డైరెక్టర్ జూల్స్ యూసుఫ్ తెలిపారు. మహిళలకు నాయకత్వ, నిర్ణయాధికార పదవుల్లో మరిన్ని అవకాశాలు కల్పించడం కీలక ప్రాధాన్యంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో భాగస్వామ్యం కల్పించడంతో పాటు పదోన్నతులు, నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడం, నాయకత్వ బాధ్యతలు చేపట్టడం వంటి అంశాల్లో సమాన అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందని యూసుఫ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం స్పష్టమైన కెరీర్ అభివృద్ధి మార్గాలను రూపొందించాలని సూచించారు.
మహిళలకు ఉత్తమ కార్యాలయాల జాబితాలో ఖతార్ సంస్థలు
గ్రేట్ ప్లేస్ టు వర్క్ మిడిల్ ఈస్ట్ ఇటీవల విడుదల చేసిన 2026 బెస్ట్ వర్క్‌ప్లేసెస్ ఫర్ విమెన్ జాబితాలో మహిళలకు అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పిస్తున్న సంస్థలకు గుర్తింపు లభించింది. ఉద్యోగినులకు గౌరవం, మద్దతు, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు అందించే సంస్థలను ఈ జాబితా ద్వారా గుర్తించారు. ఈ ఏడాది జాబితాలో ఖతార్‌కు చెందిన రెండు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. మీడియం కేటగిరీలో QIC డిజిటల్ హబ్ 18వ స్థానంలో నిలవగా, స్మాల్ కేటగిరీలో Marrybrown ఖతార్ మూడో స్థానాన్ని సాధించింది.
ఉద్యోగుల నుంచి సేకరించిన గోప్యమైన అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించినట్లు యూసుఫ్ వివరించారు. ముఖ్యంగా మహిళల పని అనుభవాలు, కార్యాలయాల్లో వారికి లభిస్తున్న గౌరవం, న్యాయం, అవకాశాలు, సంస్థలో భాగస్వామ్య భావన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
మహిళల పట్ల సమానత్వంపై సానుకూల ఫలితాలు
ఖతార్‌లో ఉద్యోగులందరినీ కలుపుకొని నిర్వహించిన సర్వేలో పలు సానుకూల అంశాలు వెల్లడయ్యాయి.
- 83.2 శాతం మంది ఉద్యోగులు లింగభేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నారని తెలిపారు.
- 78.9 శాతం మంది శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
- 74.5 శాతం మంది ఉద్యోగులు పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతకు ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు.
- 75.3 శాతం మంది తమ కార్యాలయ వాతావరణం మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యకరంగా ఉందని తెలిపారు.
- 73.8 శాతం మంది తమ పనికి సంబంధించిన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారని వెల్లడించారు.
ఈ గణాంకాలు ఖతార్‌లో మహిళా సాధికారత దిశగా పురోగతి ఉందని సూచిస్తున్నప్పటికీ, కెరీర్ అభివృద్ధి, బాధ్యతాయుతమైన పదవులకు చేరుకునే అవకాశాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని యూసుఫ్ పేర్కొన్నారు.
మహిళల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు
మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు పలు చర్యలు చేపట్టాలని యూసుఫ్ సూచించారు. పదోన్నతులకు సంబంధించిన ప్రమాణాలను పారదర్శకంగా ఉంచడం, సౌకర్యవంతమైన పని విధానాలను అమలు చేయడం, నాయకత్వ స్థాయిలో బాధ్యతను నిర్ధారించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. అలాగే మెంటరింగ్, కెరీర్లో ముందుకు వెళ్లేందుకు మార్గదర్శకత్వం అందించే కార్యక్రమాలు, ఉద్యోగ విరామం తర్వాత తిరిగి విధుల్లో చేరే మహిళలకు సహాయక విధానాలు అమలు చేయాలని సూచించారు.
ఉద్యోగుల అభిప్రాయాలను లింగం, హోదా, పని విభాగం ఆధారంగా క్రమం తప్పకుండా విశ్లేషించడం ద్వారా కార్యాలయాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తగిన పరిష్కారాలు రూపొందించవచ్చని తెలిపారు. మహిళా సాధికారత అనేది కేవలం సమానత్వానికి సంబంధించిన అంశమే కాకుండా, సంస్థల పనితీరును మెరుగుపరచడానికి, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పని సంస్కృతిని అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడుతుందని యూసుఫ్ పేర్కొన్నారు. నాయకత్వ నాణ్యతను అంచనా వేయడానికి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థ అందించే ‘గ్రేట్ లీడర్ లెన్స్’ ద్వారా కూడా ఉద్యోగుల అభిప్రాయాలను విశ్లేషించి, నమ్మకం పెంపొందించేందుకు అవసరమైన మార్పులను గుర్తించవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







