12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!

- October 16, 2026 , by Maagulf
12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!

న్యూ జెర్సీ: అమెరికా గడ్డ పై మన తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించింది. వయసు కేవలం పన్నెండేళ్లే అయినా, ఆలోచనలతో ప్రపంచాన్ని విస్మయపరిచింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేపట్టిన సాహసోపేతమైన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన 2026 కాక్స్ కన్సెర్వ్స్ హీరోస్ ప్లానెట్ ప్రొటెక్టర్ అవార్డు వరించింది. ఈ పురస్కారంతో పాటు ఆమెకు ముప్పై వేల డాలర్ల (సుమారు రూ. 25 లక్షలకు పైగా) భారీ గ్రాంట్ కూడా లభించింది. అట్లాంటాలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

న్యూజెర్సీకి చెందిన నిత్య తమ్మన.. 'సేవ్ డ్రాప్' పేరుతో ఒక యువజన పర్యావరణ సంస్థను స్థాపించారు. కేవలం తొమ్మిదేళ్ల వయసులో, షవర్ వేడెక్కుతున్న సమయంలో వృథాగా పోతున్న నీటిని చూసి ఆమెలో కలిగిన ఒక చిన్న ఆలోచన నేడు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే ఉద్యమంగా మారింది. కేవలం నీటిని ఆదా చేయడమే కాకుండా, కలుషిత నీటి సమస్యకు కూడా ఆమె వినూత్న పరిష్కారం కనుగొన్నారు. కంకర, ఇసుక, యాక్టివేటెడ్ చార్కోల్, స్పాగ్నమ్ మాస్ సాయంతో కేవలం 38 డాలర్ల ఖర్చుతో విద్యుత్ అవసరం లేని 'బయోలేయర్' అనే వాటర్ ఫిల్టర్ నమూనాను అభివృద్ధి చేసి శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్నారు.

నిత్య చేపట్టిన ఈ ప్రయాణం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆమె స్థాపించిన 'సేవ్ డ్రాప్' సంస్థ ద్వారా ఇప్పటివరకు కోటి మందికి పైగా ప్రజలకు నీటి సంరక్షణ సందేశాన్ని చేరవేశారు. అమెరికా వ్యాప్తంగా వందకు పైగా పాఠశాలల్లో క్లబ్‌లను ఏర్పాటు చేసి, డెబ్బై ఐదు మందికి పైగా యువ రాయబారులను ఈ బాధ్యతలో భాగస్వామ్యం చేశారు. వందలాది మంది పిల్లలకు ప్రతి వారం నీటి విలువను నేర్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

 పదకొండు అమెరికా రాష్ట్రాల్లోని రెస్టారెంట్లలో 'సర్వ్ హాఫ్ గ్లాస్' ప్రచారాన్ని విస్తరించి, అవసరమైన మేరకే నీటిని అందించే వినూత్న విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు లేఖలు రాసి, వాటర్-హీటింగ్ రీసర్క్యులేషన్ సిస్టమ్స్ వంటి సాంకేతికతను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలోనూ మోట్ మిలియన్ డాలర్ ఛాలెంజ్ విజేతగా, యాక్షన్ ఫర్ నేచర్ ఇంటర్నేషనల్ యంగ్ ఇకో-హీరో అవార్డు గ్రహీతగా నిత్య నిలిచారు. ఐక్యరాజ్యసమితి మహిళా హోదా కమిషన్ సమావేశాల్లో అత్యంత పిన్న వయసు డెలిగేట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.

 ఏ పనిచేయాలన్నా పెద్దయ్యే వరకు ఆగాల్సిన పని లేదని, చిన్న వయసులోనే మార్పునకు శ్రీకారం చుట్టవచ్చని నిత్య నిరూపించారు. ఒక తెలుగు మూలాలున్న చిన్నారి అమెరికాలో ఇలాంటి అరుదైన పర్యావరణ పురస్కారాన్ని దక్కించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com