నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- October 16, 2026
దుబాయ్: యూఏఈలో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల వ్యవహారంలో ఎనిమిది మంది సభ్యుల ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి డ్రైవింగ్ శిక్షణ తీసుకోకుండా, పరీక్షలు రాయకుండానే విదేశీ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ముఠా ఒక్కో లైసెన్స్ కోసం 10,000 దిర్హామ్‌లు వసూలు చేసినట్లు వెల్లడించారు. కొన్ని దేశాల్లో జారీ చేసిన అర్హత కలిగిన డ్రైవింగ్ లైసెన్స్‌లను యూఏఈ లైసెన్స్‌లుగా మార్చుకునేందుకు ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలను ముఠా దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) సంయుక్త సహకారంతో ఈ అరెస్టులు జరిగాయి.
ముఠా మోసాలు ఇలా..
దుబాయ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారణలో ఈ మోసపూరిత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూఏఈలోని కొన్ని లావాదేవీల ప్రాసెసింగ్ సంస్థల కార్యాలయాలను ఉపయోగించుకుని, ఈ ముఠా తమ సేవలను వినియోగించుకోవాలనుకునే వారిని సంప్రదించినట్లు అధికారులు గుర్తించారు.
వినియోగదారులు సంబంధిత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, అక్కడ డ్రైవింగ్ నేర్చుకోకుండా, తప్పనిసరి పరీక్షలు రాయకుండానే విదేశీ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని నమ్మబలికినట్లు వెల్లడించారు. అనంతరం ఆ లైసెన్స్‌లను ఉపయోగించి దుబాయ్‌లో యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌లుగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
అర్హత కలిగిన విదేశీ లైసెన్స్‌దారులకు అదనపు శిక్షణ లేదా పరీక్షలు లేకుండా లైసెన్స్ మార్పిడికి అవకాశం కల్పించే నిబంధనలను ముఠా దుర్వినియోగం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలు తప్పవు
అక్రమ మార్గాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందేందుకు ప్రయత్నించే వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ పత్రాల ఆధారంగా విదేశీ లైసెన్స్‌ను యూఏఈ లైసెన్స్‌గా మార్చుకున్నంత మాత్రాన గతంలో జరిగిన ఉల్లంఘనల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
రహదారి భద్రతకు ముప్పు
డ్రైవింగ్ శిక్షణ, పరీక్షలు వాహనదారుల నైపుణ్యాలను అంచనా వేయడానికి ఎంతో కీలకమని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలను పక్కనపెట్టడం వల్ల డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేని వ్యక్తులు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు, పాదచారుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
డ్రైవింగ్ శిక్షణ, పరీక్షలు లేకుండానే లైసెన్స్‌లు ఇప్పిస్తామని హామీ ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్టబద్ధమైన విధానాల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందాలని దుబాయ్ పోలీసులు నివాసితులకు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







