ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- October 17, 2026
దోహా: ఖతార్ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత వ్యూహం–2030 లక్ష్యాల సాధనకు ప్రాధాన్యతనిస్తోంది. సురక్షితమైన, స్థిరమైన ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, సుస్థిర సాగు పద్ధతుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను 30 శాతం పెంచడమే లక్ష్యంగా ఖతార్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 96 హెక్టార్ల విస్తీర్ణంలో పర్యావరణహిత, వాతావరణ నియంత్రిత గ్రీన్హౌస్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దేశీయ ఆహార ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
అక్టోబర్ 16న నిర్వహించే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఈ అంశాలను వెల్లడించింది. జీవ వ్యవసాయం, ఆధునిక సాగు విధానాలు, సహజ వనరుల పరిరక్షణ ద్వారా దేశీయ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, పరిమిత నీటి వనరులు ఖతార్ వ్యవసాయ రంగానికి సవాళ్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ నియంత్రిత గ్రీన్హౌస్ల ఏర్పాటుతో పాటు స్మార్ట్ సాగునీటి వ్యవస్థలు, ఆక్వాకల్చర్ సాంకేతికతలు, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొక్కలు, పశువుల ఆరోగ్య పరిరక్షణకు బయోసెక్యూరిటీ చర్యలను కూడా బలోపేతం చేస్తోంది.
2025 గణాంకాల ప్రకారం, తాజా కోడి మాంసం, పాలు, పాల ఉత్పత్తుల విషయంలో ఖతార్ 99 శాతం స్వయం సమృద్ధిని సాధించింది. తాజా చేపల ఉత్పత్తిలో 67 శాతం, కీలక కూరగాయల ఉత్పత్తిలో 47 శాతం స్వయం సమృద్ధి నమోదైంది. దేశీయ రైతులు, ఆహార ఉత్పత్తిదారుల కృషి జాతీయ ఆహార భద్రతకు దోహదపడుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆహార సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక ఆహార నిల్వల నిర్వహణను డిజిటల్ విధానంలో చేపట్టడంతో పాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. ఆహార ఉత్పత్తి, నిల్వ, రవాణా వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఖతార్ ప్రభుత్వం జీవ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. సేంద్రియ ఎరువులు, ప్రయోజనకర సూక్ష్మజీవులు, జీవసంబంధిత పురుగుల నియంత్రణ పద్ధతుల ద్వారా నేల సారాన్ని పెంచడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది.గ్రీన్హౌస్ సాగు, హైడ్రోపోనిక్స్ (మట్టి లేకుండా పోషక ద్రావణాలతో మొక్కల పెంపకం), వర్టికల్ ఫార్మింగ్ వంటి ఆధునిక విధానాలను జీవ వ్యవసాయంతో అనుసంధానించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







