ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..

- October 19, 2026 , by Maagulf
ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గల్ఫ్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న GTWCA

దుబాయ్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను GTWCA (గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో 19వ సారి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు విజయవంతం కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు, ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

19 ఏళ్లుగా తెలంగాణ సంప్రదాయాల పరిరక్షణ

గల్ఫ్ ప్రాంతంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్న GTWCA.. వరుసగా 19 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం విశేషం. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు తమ సంస్కృతితో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ వేడుకలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

19వ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహిళా విభాగం సభ్యులు, కళాకారులు, స్పాన్సర్లు, నిర్వాహకులు, వాలంటీర్లకు GTWCA ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు GTWCA  ప్రెసిడెంట్ జువ్వాడి శ్రీనివాస్ తెలియజేశారు.

అందరి సహకారం, అభిమానం, ఐక్యతతోనే ఈ వేడుకలు ఘనవిజయం సాధించాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ ఇటువంటి వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

“మన సంప్రదాయం మన బలం.. మన బతుకమ్మ మన గర్వం.. GTWCA మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక” అనే సందేశంతో ఈ సంబరాలు తెలంగాణ ప్రజల్లో సాంస్కృతిక ఐక్యతను చాటిచెప్పాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com