ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!

- October 19, 2026 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!

దుబాయ్‌: గల్ఫ్‌ ప్రాంత దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేందుకు సోషల్‌ మీడియాలో బాట్స్‌ (ఆటోమేటెడ్‌ ఖాతాలు), తప్పుడు వార్తలను ఉపయోగిస్తున్నారని యూఏఈ ఉన్నతాధికారి హెచ్చరించారు. 2026 అక్టోబర్‌ నెలలోనే 11,000కు పైగా కొత్త బాట్స్‌ సృష్టించినట్లు వెల్లడించారు. ఇంత భారీ సంఖ్యలో బాట్స్‌ వెలుగులోకి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దుబాయ్‌లో జరిగిన యూఏఈ కరస్పాండెంట్స్‌ మజ్లిస్‌ కార్యక్రమంలో నేషనల్‌ మీడియా అథారిటీ (NMA) ఛైర్మన్‌ అబ్దుల్లా బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ బుట్టి అల్‌ హమీద్‌ ఈ విషయాలను వెల్లడించారు. వివిధ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేసేందుకు బాట్స్‌ను ఉపయోగిస్తున్న తీరును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

తప్పుడు ప్రచారాన్ని పెంచుతున్న బాట్స్‌

సోషల్‌ మీడియా వేదికలపై తప్పుడు వార్తలు, తప్పుదారి పట్టించే సమాచారం విస్తృతంగా వ్యాపిస్తోందని అల్‌ హమీద్‌ అన్నారు. బాట్స్‌ ద్వారా ఒకే సందేశాన్ని పెద్ద సంఖ్యలో ప్రచారం చేయవచ్చని, దీంతో ఒక అభిప్రాయానికి ప్రజల్లో విస్తృత మద్దతు ఉన్నట్లు భ్రమ కలిగించే అవకాశం ఉంటుందని వివరించారు. అయితే, ఈ బాట్స్‌ ఏయే సోషల్‌ మీడియా వేదికల్లో పనిచేస్తున్నాయి? వాటి వెనుక ఎవరున్నారు? అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

వేలాది ఖాతాల తొలగింపు

హానికరమైన ఆన్‌లైన్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు యూఏఈ అధికారులు సోషల్‌ మీడియా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారని అల్‌ హమీద్‌ తెలిపారు. అనేక చర్యలను బహిరంగంగా ప్రకటించకుండానే అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 మేలో NMA సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ జమాల్‌ మొహమ్మద్‌ అల్‌ కాబీ వెల్లడించిన వివరాల ప్రకారం, టిక్‌టాక్‌లోనే 10,000 ఖాతాలను తొలగించారు. యూఏఈ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, దుబాయ్‌తో పాటు ఇతర ఎమిరేట్లపై తప్పుడు ప్రచారం చేసేలా ఏఐతో రూపొందించిన వీడియోలు, ఇతర కంటెంట్‌ను ఆ ఖాతాలు ప్రచురించినట్లు తెలిపారు.

అలాగే, 2026 ఏప్రిల్‌లో ఇరాన్‌ దాడుల సమయంలో హింసను ప్రేరేపించే కంటెంట్‌ను ప్రచురించినందుకు ఇటీవలి నెలల్లో 100కు పైగా సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు అల్‌ హమీద్‌ వెల్లడించారు. ఈ ఖాతాలు గల్ఫ్‌ దేశాల ఆన్‌లైన్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.

ప్రతి తప్పుడు వార్తకు బహిరంగంగా స్పందించరు

సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి తప్పుడు వార్తకు అధికారులు బహిరంగంగా స్పందించకపోవడానికి కారణాన్ని అల్‌ హమీద్‌ వివరించారు. ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించేందుకు రూపొందించిన తప్పుడు సమాచారానికి అధికారికంగా సమాధానం ఇవ్వడం వల్ల ఆ కంటెంట్‌కు అనవసరమైన ప్రచారం, విశ్వసనీయత లభించే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రజలకు నిజమైన వివరణ అవసరమైన అంశాలను, ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించేందుకు ప్రచారం చేసే కంటెంట్‌ను వేర్వేరుగా గుర్తించి స్పందిస్తామని తెలిపారు. అయితే, తప్పుడు సమాచారాన్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. జర్నలిస్టులతో అధికారులు నేరుగా సంప్రదింపులు కొనసాగించడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మీడియా సంస్థలతో మెరుగైన సంబంధాలు ఉంటే ప్రజలకు సరైన సమాచారం చేరవేయడం సులభమవుతుందని వివరించారు.

తప్పుడు వార్తలు షేర్‌ చేసినా జైలు శిక్ష, జరిమానా

యూఏఈలో తప్పుడు వార్తలు ప్రచురించడం లేదా వాటిని ఇతరులకు పంపించడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- సాధారణ పరిస్థితుల్లో: ఫెడరల్ డిక్రీ-లా నంబర్‌ 34 ఆఫ్‌ 2021లోని ఆర్టికల్‌ 52 ప్రకారం, తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వంటి నేరాలకు కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, కనీసం Dh100,000 జరిమానా విధించవచ్చు.

- సంక్షోభం, అత్యవసర పరిస్థితి లేదా విపత్తు సమయంలో: నేరం తీవ్రతను బట్టి కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష, కనీసం Dh200,000 జరిమానా విధించవచ్చు.

2026 ఫిబ్రవరిలో యూఏఈ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. తప్పుడు సమాచారాన్ని స్వయంగా సృష్టించకపోయినా, ధ్రువీకరించని కంటెంట్‌ను షేర్‌ చేయడం లేదా రీపోస్ట్‌ చేయడం వల్ల కూడా చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది.

గల్ఫ్‌ దేశాల స్థాయిలోనూ చర్యలకు ప్రతిపాదన

ఆన్‌లైన్‌ తప్పుడు ప్రచారాన్ని అరికట్టే అంశంపై గల్ఫ్‌ దేశాల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. 2026 మార్చిలో జరిగిన జీసీసీ సమాచార మంత్రుల అత్యవసర సమావేశంలో అల్‌ హమీద్‌ కీలక ప్రతిపాదనలు చేశారు.

అనామక సోషల్‌ మీడియా ఖాతాలపై సమన్వయంతో చర్యలు తీసుకోవడం, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ (AI) సాయంతో పనిచేసే ప్రాంతీయ పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని 24 గంటలూ అందుబాటులో ఉంచడం వంటి అంశాలను ప్రతిపాదించారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, ధ్రువీకరించని వార్తలను ఇతరులకు పంపించే ముందు వాటి విశ్వసనీయతను పరిశీలించాలని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com