నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!

- October 20, 2026 , by Maagulf
నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!

మనామా: బహ్రెయిన్‌లోని ముహర్రఖ్ సూక్ (Muharraq Souq) పరిసరాల్లో రహదారుల అభివృద్ధి పనులు నవంబర్ మధ్య నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కీలకమైన ఒక రహదారిని మరో రెండు రోజుల్లో వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముహర్రఖ్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అబ్దులజీజ్ అల్ నార్ వెల్లడించారు.   

షేక్ హమద్ అవెన్యూ వైపు వెళ్లే తూర్పు ప్రాంత రహదారిని తొలుత ప్రారంభించనున్నారు. అనంతరం సూక్‌కు అత్యంత సమీపంలో ఉన్న రహదారిపై మిగిలిన పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కార్మికులు చక్కగా పనిచేస్తున్నారని అల్ నార్ ప్రశంసించారు. క్షేత్రస్థాయి పరిశీలనల సమయంలో తాను సూచించిన సమస్యలను కూడా అధికారులు పరిష్కరించారని తెలిపారు.

పార్కింగ్ ఫీజులపై చర్చలు

రహదారుల అభివృద్ధితో పాటు పార్కింగ్ సదుపాయాలను కూడా మెరుగుపరుస్తున్నారు. షేక్ హమద్ అవెన్యూలో కొత్త పార్కింగ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పోస్టాఫీసు ఉన్న ప్రదేశంలో అందుబాటులో ఉన్న 400కు పైగా పార్కింగ్ స్థలాల ఫీజులపై పార్కింగ్ సంస్థ అమాకిన్‌తో మున్సిపల్ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం రోడ్డుపై వాహనం పార్క్ చేసేందుకు 200 ఫిల్స్ చెల్లించాల్సి వస్తోంది. పెద్ద పార్కింగ్ ప్రాంగణంలోనూ ఫీజులను దాదాపు అదే స్థాయిలో నిర్ణయించాలని కౌన్సిల్ భావిస్తోంది. దీంతో వాహనదారులు రహదారుల పక్కన కాకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలిపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

కాగా, పార్కింగ్ ఫీజులపై ఇరు పక్షాల మధ్య ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే డిసెంబర్ 1వ తేదీ కంటే ముందుగానే, నవంబర్ మధ్య నాటికి రహదారులు, పార్కింగ్ ప్రాంతాల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

పాత కాఫీ షాప్ స్థానంలో పబ్లిక్ గార్డెన్

ముహర్రఖ్‌లోని హిలాల్ ఆసుపత్రి సమీపంలో భద్రతా కేంద్రం వెనుక ఉన్న పాత కాఫీ షాప్ ప్రదేశాన్ని శుభ్రం చేసి ప్రజా ఉద్యానవనంగా మార్చారు. ఈ పనులు కొద్ది రోజుల్లోనే పూర్తయ్యాయని అల్ నార్ తెలిపారు. అల్ క్యాసినో పార్క్ కూడా ప్రస్తుతం మంచి స్థితిలో ఉందని, అయితే మరికొన్ని మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు.

గ్రాండ్ ముహర్రఖ్ పార్క్‌ను మున్సిపల్ కౌన్సిల్ చేపట్టిన అత్యుత్తమ ప్రాజెక్టుల్లో ఒకటిగా అల్ నార్ అభివర్ణించారు. ఈ పార్కులోకి ప్రజలు 300 ఫిల్స్ చెల్లించి ప్రవేశించవచ్చు. లాభాపేక్షలేని సంస్థ పార్క్ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ఇతర సేవలను పర్యవేక్షిస్తోందన్నారు.

రహదారుల మరమ్మతులు

ముహర్రఖ్‌లోని నివాస ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులను కూడా మరమ్మతు చేయనున్నారు. ప్రధాన అభివృద్ధి పనులతోపాటు స్థానిక వీధుల పరిస్థితిని పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేపట్టనున్నట్లు అల్ నార్ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com