దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- October 21, 2026
మూడు రోడ్ల పై వేగ పరిమితి పెంపు.. మరో రెండు రోడ్లపై తగ్గింపు | వాహనదారులు కొత్త నిబంధనలు గమనించాలి
దుబాయ్: దుబాయ్‌లోని ఐదు ప్రధాన రహదారులపై వాహనాల వేగ పరిమితులను నవంబర్ 1, 2026 నుంచి మారుస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) బుధవారం ప్రకటించింది. మూడు రహదారులపై వేగ పరిమితులను పెంచగా, మరో రెండు రహదారులపై తగ్గించింది. ఈ మార్పులు ఆయా రహదారుల రెండు దిశల్లోనూ అమలుకానున్నాయి.
ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరచడం, రహదారి భద్రతను పెంపొందించడం, రోడ్ల స్వభావానికి అనుగుణంగా వేగ పరిమితులను నిర్ణయించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు RTA వెల్లడించింది.
వేగ పరిమితులు పెరిగే రహదారులు
అల్ అసాయెల్ స్ట్రీట్: ఔద్ మెయితా స్ట్రీట్ నుంచి అల్ మైదాన్ స్ట్రీట్ వరకు ప్రస్తుత వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెరగనుంది.
అల్ ముస్తక్బల్ స్ట్రీట్: షేక్ రషీద్ స్ట్రీట్ నుంచి అల్ మైదాన్ స్ట్రీట్ వరకు గంటకు 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్లకు పెంచనున్నారు.
లతీఫా బింట్ హమ్దాన్ స్ట్రీట్: షేక్ జాయెద్ రోడ్ నుంచి అల్ ఖైల్ రోడ్ వరకు గంటకు 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్లకు పెరగనుంది.
వేగ పరిమితులు తగ్గే రహదారులు
అల్ రిబాత్ స్ట్రీట్: మర్రాకెష్ స్ట్రీట్ నుంచి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ వరకు గంటకు 100 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లకు తగ్గించనున్నారు.
షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్ స్ట్రీట్: 2వ డిసెంబర్ స్ట్రీట్ నుంచి ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్ వరకు గంటకు 80 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్లకు తగ్గించనున్నారు.
దుబాయ్ పోలీసులతో సమన్వయం
ఈ మార్పులను దుబాయ్ పోలీసులతో సమన్వయం చేసుకుని అమలు చేస్తున్నట్లు RTA తెలిపింది. కొత్త వేగ పరిమితులకు అనుగుణంగా ఆయా రహదారులపై ఉన్న ట్రాఫిక్ సూచిక బోర్డులను మార్చనున్నారు. స్పీడ్ కెమెరాలను కూడా కొత్త పరిమితులకు అనుగుణంగా ముందుగానే పునఃసర్దుబాటు చేయనున్నారు.
సాంకేతిక అధ్యయనం ఆధారంగా నిర్ణయం
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ కన్సల్టెంట్ సహకారంతో సమగ్ర ఇంజినీరింగ్, సాంకేతిక అధ్యయనం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు RTA వివరించింది. ట్రాఫిక్ సజావుగా సాగడంతో పాటు ప్రమాదాల ముప్పును తగ్గించడం, రహదారుల నిర్మాణ లక్షణాలు మరియు ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులకు తగిన వేగ పరిమితులను అమలు చేయడం ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
దుబాయ్ స్పీడ్ మేనేజ్మెంట్ మాన్యువల్‌లో 2026లో చేసిన సాంకేతిక మార్పులు, అంతర్జాతీయ ప్రమాణాలను కూడా ఈ నిర్ణయంలో పరిగణనలోకి తీసుకున్నారు.
వాహనాల రద్దీ, రహదారుల నిర్మాణం, పరిసర ప్రాంతాల్లో పట్టణ అభివృద్ధి, వాస్తవ వాహన వేగాలు, పాదచారుల రాకపోకలు, ఇతర కీలక సౌకర్యాల ఉనికి వంటి అంశాల ఆధారంగా వేగ పరిమితులను నిర్ణయిస్తామని RTA తెలిపింది. వాహనాల వాస్తవ వేగాలను అంచనా వేయడానికి 85వ పర్సంటైల్ వేగ ప్రమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
వాహనదారులకు సూచన
దుబాయ్‌లో రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా ప్రధాన రహదారుల వేగ పరిమితులను RTA ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త పరిమితులను వాహనదారులు గమనించి, రహదారులపై ఏర్పాటు చేసే సూచిక బోర్డులను అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..







