ఒమన్‌లో సైబర్‌ సెక్యూరిటీ రంగానికి ఊతం..

- October 22, 2026 , by Maagulf
ఒమన్‌లో సైబర్‌ సెక్యూరిటీ రంగానికి ఊతం..

మస్కట్‌: ఒమన్‌లో సైబర్‌ సెక్యూరిటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన ‘హదాతా సైబర్‌ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్‌’లో 6 జాతీయ స్టార్టప్‌ సంస్థలు, 4 ప్రోటోటైప్‌లను ప్రదర్శించారు. ఒమన్‌ యువత రూపొందించిన నూతన సాంకేతిక పరిష్కారాలను స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. 7వ సైబర్‌ సెక్యూరిటీ ఫోరమ్‌లో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఒమన్‌ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఇంజినీర్‌ సయీద్‌  అల్‌ మవాలీ ఆధ్వర్యంలో ప్రదర్శన ప్రారంభమైంది.

ఒమన్‌ యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం

హదాతా కేంద్రాల ద్వారా అభివృద్ధి చేసిన ప్రోటోటైప్‌లతో పాటు జాతీయ స్టార్టప్‌ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఒమన్‌ యువత నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఆలోచనలను వినూత్న ఉత్పత్తులుగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా ప్రారంభమైన సంస్థలకు వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు, వాటి ఉత్పత్తులను అభివృద్ధి చేసి అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం

నేషనల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెడీనెస్ టీమ్‌ (OCERT) డైరెక్టర్‌ జనరల్‌ ఇంజినీర్‌ బదర్‌ అలీ అల్‌ సల్హీ మాట్లాడుతూ.. సైబర్‌ సెక్యూరిటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, జాతీయ సంస్థలకు అండగా నిలవడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రంగంలో మరిన్ని అవకాశాలను సృష్టించవచ్చని వివరించారు.సైబర్‌ సెక్యూరిటీ అనేది కేవలం కంప్యూటర్‌ వ్యవస్థలు, డేటా, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను రక్షించడానికే పరిమితం కాదని ఆయన అన్నారు. ఇది ప్రత్యేక ఉత్పత్తులు, సాంకేతిక సేవలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో కూడిన పరిశ్రమగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

 డిజిటల్‌ ఆస్తుల రక్షణ అవసరంగా మాత్రమే సైబర్‌ సెక్యూరిటీని చూడకుండా, దేశీయ నైపుణ్యాలు, ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాల ఆధారంగా ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు వివరించారు. ఈ చర్యల ద్వారా ఒమన్‌లో సైబర్‌ సెక్యూరిటీ రంగం బలోపేతం కావడంతో పాటు, కొత్త ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల పెరుగుదల, దేశీయ సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com