సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు పునఃప్రారంభం
- October 22, 2026
దాడిలో ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు.. మృతుల్లో భారతీయుడు
దమ్మామ్: సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం (దమ్మామ్)పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి అనంతరం విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. విమానాశ్రయంలో విమాన రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) గురువారం వెల్లడించింది.
ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. తొలుత ఒకరు మరణించినట్లు సమాచారం అందగా, అనంతరం మరో వ్యక్తి మృతిచెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరిందని అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఒకరు సౌదీ పౌరుడు కాగా, మరొకరు సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుడిగా గుర్తించారు.
గాయపడిన వారిలో భారతీయులు కూడా
దాడిలో గాయపడిన ఎనిమిది మందిలో ఒకరు సౌదీ పౌరుడు కాగా, ఏడుగురు ప్రవాసులు ఉన్నారు. వీరిలో భారతదేశం, యెమెన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందినవారు ఉన్నట్లు GACA తెలిపింది. గాయపడినవారికి స్వల్ప గాయాల నుంచి తీవ్ర గాయాల వరకు అయ్యాయని, వారందరికీ పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
భద్రతా చర్యలు ముమ్మరం
దాడి కారణంగా విమానాశ్రయానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతోపాటు, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత భద్రతా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు GACA వెల్లడించింది.
సౌదీ అరేబియాలో పౌర విమానయాన మౌలిక సదుపాయాల రక్షణ, విమానయాన వ్యవస్థ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అయితే, ఈ దాడి ఎలా జరిగింది, విమానాశ్రయానికి ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు పునఃప్రారంభం
- నాంపల్లి గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’ వేడుకలు ప్రారంభం
- దుబాయ్‌లో ఘనంగా AES అచీవర్స్ సమ్మిట్ & ఆనర్స్ 2026
- సౌదీ అరేబియాను వెంటనే విడిచి వెళ్ళండి..అమెరికా ఆదేశం
- సౌదీలో మసాజ్ సెంటర్లో అనైతిక కార్యకలాపాలు.. ప్రవాసి అరెస్ట్..!!
- ఒమన్‌లో సైబర్ సెక్యూరిటీ రంగానికి ఊతం..
- ఖతార్‌లో సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో లావాదేవీలు..!
- అంతర్జాతీయ మోసాలకు చెక్..✓
- కువైట్‌లో అక్రమ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టు..!
- బహ్రెయిన్‌లో వీధి కుక్కలు, పిల్లుల సమస్యకు పరిష్కారం..!







