కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి
- October 22, 2026
కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మడికెరి తాలూకా పరిధిలోని మాల్యారె ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్ (36), ఆయన భార్య ప్రమిత (34), నలుగురు సంవత్సరాల పసికందు లియ (4) దుర్మరణం చెందారు.
ఎలా జరిగిందంటే..?
విజేశ్ దంపతులు తమ కారులో మాల్యారె వద్ద ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ తమ పెద్ద కూతురిని ఉంచి, చిన్న కూతురు లియను వెంటబెట్టుకుని తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు తిరిగి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలోని చెరువు కట్ట రోడ్డుపై వెళుతుండగా.. అకస్మాత్తుగా కారు ఒక చక్రం రోడ్డు కిందకు జారింది. దీంతో అదుపుతప్పిన కారు నేరుగా చెరువులోని దట్టమైన బురదలోకి దూసుకెళ్లి దిగబడిపోయింది. రాత్రి సమయం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు.
ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలిన వైనం
చెరువులోని బురదలో కారు పూర్తిగా కూరుకుపోవడంతో బాధితులు ఎవరూ బయటకు రాలేకపోయారు. కారులోనే ఊపిరాడక విలవిల్లాడుతూ ముగ్గురూ ప్రాణాలు వదిలారు. బుధవారం ఉదయం ఆ మార్గంలో వెళ్తున్న కార్మికులు చెరువులో కారును గమనించి వెంటనే స్థానికుల సహాయంతో లోపలివారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించి సిద్ధాపుర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే వారు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాలను మడికెరి ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బంధువుల ఇంటి వద్ద ఉన్న పెద్ద కూతురు మినహా తల్లిదండ్రులు, చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ చిన్నారి అనాథగా మారడం స్థానికులను కంటతడి పెట్టించింది.
తాజా వార్తలు
- కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి
- యాస్ ఐలాండ్‌లో మరోసారి IIFA సందడి.. 2027 జనవరి 22, 23 తేదీల్లో వేడుకలు!
- కువైట్‌లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!
- సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- ఖతార్ లో అత్యవసర ప్రతిస్పందన బలోపేతం..!!
- మార్చి 24న మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2027..!!
- వాహనం ఢీకొని 23 ఏళ్ల మోటార్‌సైకిలిస్ట్ మృతి..!!
- దుబాయ్‌లోని పామ్ జుమేరా వద్ద కొత్త 'వ్యూ' పాయింట్..!!
- దుబాయ్‌లో రెండు నెలల చిన్నారికి గుండె శస్త్రచికిత్స.. Dh146,515 వైద్య ఖర్చులు!
- సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు పునఃప్రారంభం







