యూఏఈలో ఐఫోన్ డ్యుయోకు భారీ డిమాండ్..!!
- October 23, 2026
దుబాయ్: యాపిల్ సంస్థ తొలిసారిగా విడుదల చేసిన ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయోకు యూఏఈలో భారీ డిమాండ్ నెలకొంది. అక్టోబర్ 23న మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ స్టాక్ పరిమితంగా ఉండటంతో రీసేల్ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధరతో పోలిస్తే అధిక ధరకు విక్రయిస్తూ కొందరు వ్యాపారులు కేవలం గంటలోనే 30,000 దిర్హామ్‌ల వరకు లాభాలు ఆర్జించినట్లు చెబుతున్నారు. మార్కెట్లో పరిమిత సంఖ్యలోనే ఫోన్లు అందుబాటులో ఉండటంతో ఒక్కో ఐఫోన్ డ్యుయో ధర 25,000 దిర్హామ్‌ల వరకు పలుకుతోంది.
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ సలీమోవ్ 2TB మోడల్‌కు చెందిన ఎనిమిది ఫోన్లను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఈ మోడల్ అసలు ధర 13,599 దిర్హామ్‌లు కాగా, యూఏఈలోనే ఒక్కో ఫోన్‌కు 25,000 దిర్హామ్‌ల వరకు ఆఫర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. అంటే ఒక్కో ఫోన్‌పై 11,000 దిర్హామ్‌లకు పైగా అదనపు ధర లభించే అవకాశం ఉంది. అయితే, యూఏఈలో విక్రయించకుండా ఉజ్బెకిస్థాన్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అక్కడ ఈ ఫోన్ ఇంకా విడుదల కాకపోవడంతో మరింత ధర లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
గంటలోనే 32,000 దిర్హామ్‌ల లాభం
దుబాయ్‌లోని దేరా ప్రాంతంలో మొబైల్ దుకాణం నిర్వహించే మహమ్మద్ అనే రీసెల్లర్ తనకు వచ్చిన లాభాలను వివరించారు. 256GB మోడల్‌కు చెందిన నాలుగు ఫోన్లను కొనుగోలు చేసి, ఒక్కో ఫోన్‌పై 8,000 దిర్హామ్‌ల లాభంతో విక్రయించినట్లు తెలిపారు. దీంతో గంటలోనే సుమారు 32,000 దిర్హామ్‌ల లాభం పొందినట్లు వెల్లడించారు.
నవంబర్ వరకు స్టాక్ కొరత
ఎక్స్‌టెల్ మొబైల్స్ యజమాని మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుందని ముందే అంచనా వేసినట్లు తెలిపారు. అయితే, పరిమిత సంఖ్యలోనే ఫోన్లు అందుబాటులోకి రావడంతో తమకు కేవలం మూడు ఫోన్లు మాత్రమే లభించాయని చెప్పారు. తదుపరి సరుకు నవంబర్‌లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గతంలో శాంసంగ్ ట్రై-ఫోల్డ్ ఫోన్, హువావే ట్రై-ఫోల్డ్ ఫోన్లు విడుదలైన సమయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొందని ఆయన గుర్తుచేశారు. అప్పట్లోనూ వినియోగదారులు ఒక్కో ఫోన్ కోసం వేలాది దిర్హామ్‌లు అదనంగా చెల్లించేందుకు సిద్ధపడ్డారని తెలిపారు.
జనవరి 2027 వరకు వెయిటింగ్
పేరు వెల్లడించేందుకు ఇష్టపడని మరో విక్రేత 30కి పైగా ఫోన్లను బుక్ చేసుకోగా, వాటిలో 14 ఇప్పటికే విక్రయించినట్లు తెలిపారు. ఒక్కో ఫోన్‌పై సుమారు 7,000 దిర్హామ్‌ల లాభం పొందినట్లు వెల్లడించారు. ధరలు మరింత పెరుగుతాయనే అంచనాతో మరో పది ఫోన్లను ప్రస్తుతం విక్రయించకుండా నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పుడే ఆర్డర్ చేసేవారికి కొన్ని సందర్భాల్లో డెలివరీ తేదీ జనవరి 2027 వరకు ఇస్తున్నారని విక్రేతలు పేర్కొంటున్నారు. ఈ దీర్ఘ నిరీక్షణ, మార్కెట్లో ఫోన్ల కొరత కారణంగా వచ్చే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ యూఏఈలో ప్రీమియం ధరలకు విక్రయమవుతుండటం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- జనవరిలో ఖతార్ అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్..!!
- హౌతీల వాదనను ఖండించిన సౌదీ నేతృత్వంలోని కూటమి..!!
- కువైట్ లో 2వేల కంపెనీల లైసెన్స్ సస్పెండ్..!!
- యూఏఈలో ఐఫోన్ డ్యుయోకు భారీ డిమాండ్..!!
- ఒమన్ సముద్ర జలాల్లో పింక్ డాల్ఫిన్..!!
- అక్టోబర్ 31 వరకు సౌదీ అరేబియాకు ఇండిగో విమాన సర్వీసుల రద్దు
- మళ్లీ తెరపైకి పదేళ్ల నాటి ఫుట్ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన..!!
- దుబాయ్‌లో 27వ అంతర్ పాఠశాలల డిబేట్ కాంపిటీషన్ ఫైనల్
- భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్..
- అమెరికా వర్క్ వీసా నిబంధనల పై మార్కో రూబియో వివరణ







