దుబాయ్‌లో పాదచారుల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం..
- October 23, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే AED 400 జరిమానా
దుబాయ్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, పాదచారుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో దుబాయ్ పోలీసులు ఎమిరేట్వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పాదచారులు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రోడ్డు దాటేందుకు నిర్దేశించిన ప్రదేశాలను ఉపయోగించడం, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, రహదారులపై బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ సుల్తాన్ అల్ సువైదీ మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రమాదాలను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
పాదచారులు నిర్దేశించిన క్రాసింగ్‌ల వద్ద మాత్రమే రోడ్డు దాటాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు దాటే ముందు అటు ఇటు గమనించి, వాహనాలు వస్తున్నాయా లేదా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
దుబాయ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది తమ పరిధుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ పాదచారులకు రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
వాహనదారులకు కూడా పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని తగ్గించాలని, పాదచారుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, నిర్దేశిత క్రాసింగ్‌ల వద్ద రోడ్డు దాటుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించి సురక్షితమైన రహదారులను నిర్మించగలమని బ్రిగేడియర్ అల్ సువైదీ పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే AED 400 జరిమానా
పాదచారులు ట్రాఫిక్ సిగ్నళ్లను పట్టించుకోకుండా రోడ్డు దాటినా, నిర్దేశించని ప్రదేశాల్లో రహదారిని దాటినా AED 400 జరిమానా విధించే నిబంధన ఉందని బ్రిగేడియర్ అల్ సువైదీ గుర్తుచేశారు.
ఫెడరల్ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 89 ప్రకారం ఈ జరిమానా వర్తిస్తుందని తెలిపారు. పాదచారులు నిర్దేశిత క్రాసింగ్లను ఉపయోగించడంతో పాటు, ట్రాఫిక్ సిగ్నళ్లను గమనించి సురక్షితంగా రోడ్డు దాటాలని సూచించారు.
దుబాయ్‌లో నివసిస్తున్నవారు, పర్యాటకులు రోడ్డు భద్రతా సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడం, పాదచారులు సహా రహదారిని ఉపయోగించే వారందరికీ భద్రత కల్పించడం తమ ప్రాధాన్యమని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ షాపింగ్ పేరుతో బ్యాంకు ఖాతాలకు టోకరా.. ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- దుబాయ్‌లో పాదచారుల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం..
- ఖతార్‌లో ఘనంగా IWA దీపావళి బజార్ ప్రారంభం
- ప్రధాని మోదీతో షేక్ థియాబ్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ భేటీ
- దక్షిణ భారతాన్ని అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్
- జనవరిలో ఖతార్ అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్..!!
- హౌతీల వాదనను ఖండించిన సౌదీ నేతృత్వంలోని కూటమి..!!
- కువైట్ లో 2వేల కంపెనీల లైసెన్స్ సస్పెండ్..!!
- యూఏఈలో ఐఫోన్ డ్యుయోకు భారీ డిమాండ్..!!
- ఒమన్ సముద్ర జలాల్లో పింక్ డాల్ఫిన్..!!







