గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు

- October 24, 2026 , by Maagulf
గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు

అజ్మాన్: యూఏఈలోని గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (GMU) అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తిలో అరబ్ ప్రాంతంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ – అరబ్ రీజియన్ 2027లో తొలిసారిగా చోటు దక్కించుకున్న ఈ విశ్వవిద్యాలయం, మొత్తం ర్యాంకింగ్స్‌లో 125వ స్థానంలో నిలిచింది. థంబే గ్రూప్‌కు చెందిన ఈ విద్యాసంస్థకు లభించిన ఈ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో దాని ప్రాధాన్యతను చాటుతోంది.

ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2027లోనూ గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ దృక్పథం (International Outlook) విభాగంలో మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విభాగంలో 99.4 స్కోరు సాధించడం విశేషం. 118 దేశాలు, ప్రాంతాలకు చెందిన 2,297 విశ్వవిద్యాలయాలను పరిశీలించగా GMU అగ్రస్థానంలో నిలిచింది.

THE వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా చోటు సంపాదించిన GMU, 2027 ఎడిషన్‌లో 1,001–1,200 ర్యాంకింగ్ విభాగంలో నిలిచింది. యూఏఈలో ప్రత్యేకంగా వైద్య, ఆరోగ్య శాస్త్రాలపై దృష్టి సారించిన విశ్వవిద్యాలయాల్లో ఈ ఎడిషన్‌లో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిలిచినట్లు యూనివర్సిటీ వెల్లడించింది. భిన్నమైన ప్రమాణాలతో ర్యాంకింగ్స్‌ ఇచ్చే రెండు అంతర్జాతీయ సంస్థలు GMU అంతర్జాతీయ విస్తృతిని గుర్తించడం విశేషం.
అంతర్జాతీయ విద్యార్థులకు సమగ్ర వైద్య విద్య
GMUలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు కలిసి చదువుకోవడమే కాకుండా, వాస్తవ వైద్య పరిస్థితుల్లో శిక్షణ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. థంబే యూనివర్సిటీ హాస్పిటల్‌తో పాటు థంబే హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లోని వివిధ వైద్య శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులు ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుతున్నారు. బహుళ జాతుల వైద్య బృందాలతో కలిసి పనిచేస్తూ, వివిధ నేపథ్యాలకు చెందిన రోగులకు సేవలందించే అనుభవాన్ని సంపాదిస్తున్నారు.

ఇతర అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ గుర్తింపు

THE అరబ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2026లో 268 విద్యాసంస్థల్లో GMU 101–125 ర్యాంకింగ్ విభాగంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో విశ్వవిద్యాలయాల పనితీరును అంచనా వేసే THE ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌ 2026లో 1,646 సంస్థల్లో 301–400 విభాగంలో స్థానం సంపాదించింది.

ఈ ర్యాంకింగ్స్‌లో పలు విభాగాల్లోనూ GMUకు గుర్తింపు లభించింది.
- SDG 10 – అసమానతల తగ్గింపు: ప్రపంచవ్యాప్తంగా 23వ స్థానం.
- SDG 4 – నాణ్యమైన విద్య: 60వ స్థానం.
- SDG 3 – ఆరోగ్యం, శ్రేయస్సు: 64వ స్థానం.
అలాగే, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ బై సబ్జెక్ట్ 2026లో GMU కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ విభాగంలో 351–400 ర్యాంకింగ్ విభాగంలో నిలిచింది.

50కి పైగా విద్యా కార్యక్రమాలు

1998లో స్థాపించబడిన గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో ఫౌండేషన్ కోర్సులు, డిప్లొమాలు, బ్యాచిలర్‌, మాస్టర్స్‌, డాక్టరల్ డిగ్రీలతో పాటు ఇంటర్న్‌షిప్‌లు, రెసిడెన్సీ కార్యక్రమాలు కలిపి 50కి పైగా విద్యా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్‌, డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్‌, హెల్త్ సైన్సెస్‌, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌, వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి విభాగాల్లో విద్యను అందిస్తోంది.

ప్రస్తుతం 116కు పైగా దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుండగా, 56 దేశాల నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారు. ఇప్పటివరకు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన 5,000 మందికి పైగా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సేవా వ్యవస్థల్లో పనిచేస్తున్నారు.

2026 జూన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (QAA) నుంచి సంస్థాగత గుర్తింపు పొందింది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, అమెరికాకు చెందిన అక్రెడిటేషన్ కౌన్సిల్ ఫర్ ఫార్మసీ ఎడ్యుకేషన్‌, వరల్డ్ ఫిజియోథెరపీ, ఆస్ట్రేలియన్ డెంటల్ కౌన్సిల్‌, యూకేకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ సైన్సెస్ వంటి సంస్థల గుర్తింపులు కూడా GMUకు ఉన్నాయి. యూనివర్సిటీలోని అన్ని విద్యా కార్యక్రమాలకు యూఏఈ కమిషన్ ఫర్ అకడమిక్ అక్రెడిటేషన్ గుర్తింపు ఉంది. 2026లో ఇంటర్నేషనల్ ఇన్‌క్లూజన్ అవార్డు, డైవర్సిటీ ఛాంపియన్ అవార్డులను కూడా అందుకుంది.

స్ప్రింగ్‌ 2027 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో స్ప్రింగ్‌ 2027 విద్యా సెషన్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. యూఏఈతో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు వైద్య, ఆరోగ్య శాస్త్రాల కోర్సులు, స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ http://www.gmu.ac.ae ను సందర్శించవచ్చు.

అంతర్జాతీయ విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య, పరిశోధన, ప్రాక్టికల్ శిక్షణ అందించడంలో GMU సాధిస్తున్న విజయాలు యూఏఈ ఉన్నత విద్యారంగానికి మరింత గుర్తింపును తీసుకొస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com