భారత్‌-కువైట్‌ దౌత్య సంబంధాలకు 65 ఏళ్లు.. మొక్కలు నాటిన భారతీయులు..!!

- October 25, 2026 , by Maagulf
భారత్‌-కువైట్‌ దౌత్య సంబంధాలకు 65 ఏళ్లు.. మొక్కలు నాటిన భారతీయులు..!!

కువైట్‌: భారత్‌-కువైట్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కువైట్‌లోని రావ్దా పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాయబార కార్యాలయం, ARMS4U సంయుక్తంగా అక్టోబర్ 246న ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో కువైట్‌ ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, భారతీయ ప్రవాసులు, కుటుంబ సభ్యులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిపై భారత్‌, కువైట్‌లకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

అమ్మకు, ప్రకృతి మాతకు అంకితం

కార్యక్రమంలో భారత రాయబారి పరమితా త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమ్మలకు, ప్రకృతి మాతకు అందించే అర్థవంతమైన నివాళి అని పేర్కొన్నారు. మనల్ని ప్రేమతో పెంచి పోషించే తల్లుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడంతో పాటు, సమస్త జీవరాశికి ఆధారమైన భూమిని పరిరక్షించాల్సిన బాధ్యతను ఈ ప్రచారం గుర్తుచేస్తుందని తెలిపారు. భారత్‌-కువైట్‌ మధ్య 65 ఏళ్ల దౌత్య సంబంధాలు పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రజల మధ్య బలమైన అనుబంధంతో మరింత పటిష్ఠమయ్యాయని ఆమె అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహబంధం భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షించారు.

ఎడారి వాతావరణం ఉండే కువైట్‌లో పర్యావరణ పరిరక్షణకు సామాజిక భాగస్వామ్యం ఎంతో అవసరమని రాయబారి పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్క పచ్చదనాన్ని పెంచడంతో పాటు నీడను అందించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో దోహదపడుతుందని వివరించారు.పర్యావరణ పరిరక్షణలో పిల్లల పాత్రను కూడా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిల్లలు భవిష్యత్తులో మాత్రమే కాకుండా, నేటి నుంచే భూమిని కాపాడే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. చిన్న వయసులోనే మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రకృతి పట్ల బాధ్యతాయుతమైన ఆలోచనలు అలవడతాయని తెలిపారు.

2024లో ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ 2024 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ ప్రచారాన్ని ప్రారంభించారు. తల్లుల గౌరవార్థం, ప్రకృతి మాతకు నివాళిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ ప్రచారం కొనసాగుతోంది. కువైట్‌లోనూ పర్యావరణ బాధ్యతను వ్యక్తిగత కృతజ్ఞతాభావంతో మేళవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com