ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

- October 26, 2026 , by Maagulf
ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

దోహా: ఇల్లు, ఆతిథ్యం, సామాజిక అనుబంధం వంటి అంశాలను వాస్తుశిల్పం, కళలు, డిజైన్ ద్వారా పరిచయం చేసే ‘బైతి బైతక్ – మై హోమ్ ఈజ్ యువర్ హోమ్’ (Beyti Beytak – My Home is Your Home) ఎగ్జిబిషన్‌ను ఖతార్ మ్యూజియమ్స్ (QM) ప్రారంభించింది. ఫ్యూచర్ ఆర్ట్ మిల్ మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన మే 29 వరకు కొనసాగనుంది. దోహాలోని అమీరి దివాన్ పక్కన ఉన్న చారిత్రక ఫహద్ బిన్ అలీ ప్యాలెస్‌లో దీనిని ఏర్పాటు చేశారు. 1953లో నిర్మించిన ఈ భవనాన్ని ప్రజల సందర్శనార్థం తెరవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

40 మందికి పైగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్ల భాగస్వామ్యం

2025లో వెనిస్‌లో జరిగిన 19వ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్‌ – లా బియన్నాలే డి వెనెజియాలో తొలిసారిగా ప్రదర్శించిన ‘బైతి బైతక్‌’ను, దోహా ప్రదర్శన కోసం మరింత విస్తరించారు. ఇందులో ఇరాక్‌కు చెందిన ఆర్కిటెక్ట్ ఓలా జ్నాద్ రూపొందించిన కొత్త కళాఖండంతో పాటు దోహా నగర అభివృద్ధికి సంబంధించిన చారిత్రక పరిశోధనలను చేర్చారు. మిడిలీస్టు, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా (MENASA) ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, నిపుణులు ఇందులో పాల్గొంటున్నారు.

మొత్తం ఏడు విభాగాలుగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఆర్కిటెక్చర్ మోడల్స్, ఫోటోలు, చారిత్రక డాక్యుమెంట్స్, సినిమాలు, ప్రత్యేక కళా సంస్థాపనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ఎడారి ఒయాసిస్‌లు, పవిత్ర స్థలాలు, నివాస గృహాలు, ఆధునిక మ్యూజియంల వరకు వివిధ సామాజిక ప్రదేశాల ప్రాధాన్యాన్ని ఇందులో వివరించారు.

ఈ ఎగ్జిబిషన్‌లో భారత్‌కు చెందిన రాజ్ రేవల్, సమీప్ పడోరా, బాలకృష్ణ దోషి వాస్తు-శిల్ప ఫౌండేషన్ తోపాటు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖుల రచనలు, ఆలోచనలు చోటు కల్పించినట్లు ఆర్ట్ మిల్ మ్యూజియం డైరెక్టర్ ఆఫ్ కాన్సెప్ట్ క్యాథరిన్ గ్రెనియర్ తెలిపారు. ‘బైతి బైతక్’ ప్రదర్శన భవిష్యత్తులో ఆర్ట్ మిల్ మ్యూజియం అనుసరించనున్న దృక్పథానికి ప్రతిరూపమని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com